Chandrababu : ఏపీలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల జాతర మొదలైంది.. మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా.. ఆస్తుల వివరాలు, కేసులు, ఇతర వ్యవహారాలకు సంబంధించి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఆస్తులకు సంబంధించిన వివరాలు అందజేశారు..
నారా భువనేశ్వరి అందజేసిన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తులు ఈ ఐదు సంవత్సరాలలో భారీగా పెరిగాయి. ఈ ఆస్తులలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మెజారిటీ వాటా కలిగి ఉన్నారు.. ఆమె హెరిటేజ్ ఫుడ్స్ లో 2.26 కోట్ల షేర్లు కలిగి ఉన్నారు.. ఒక్కో షేర్ ముఖ విలువ 337.85 గా ఉంది. ఆ ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు కలిగి ఉన్న భువనేశ్వరి ఆస్తుల విలువ దాదాపు 764 కోట్లు. ఇది మాత్రమే కాకుండా నారా భువనేశ్వరి వద్ద 3.4 కిలోల బంగారం ఉంది. 41.5 కిలోల వెండి ఉంది. 2019లో 545. 76 కోట్లుగా ఉన్న ఆస్తుల విలువ 2024 వచ్చేసరికి 764 కోట్లకు చేరుకుంది . ఇక చంద్రబాబు పేరు మీద 4.80 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. 36.31 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి.. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విలువ 41 శాతం పెరిగింది. ప్రస్తుతం అవి 810.42 కోట్లకు చేరుకున్నాయి. మీ కుటుంబం పేరు మీద మొత్తం 10 కోట్ల వరకు అప్పులున్నాయి.
చంద్రబాబు నాయుడు వద్ద 2.25 లక్షల విలువైన ఒక అంబాసిడర్ కారు ఉంది. వివిధ కేసులకు సంబంధించి 24 ఎఫ్ ఐ ఆర్ లు చంద్రబాబు పేరు మీద నమోదయ్యాయి. చంద్రబాబు పేరు మీద అంబాసిడర్ కారు తప్ప.. ఇతర వాహనాలు లేవని ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి హెరిటేజ్ ఫుడ్స్ ను నారా భువనేశ్వరి ఫ్యూచర్ గ్రూప్ తో కలిసి కొద్ది రోజులపాటు నిర్వహించారు. ఆ తర్వాత అది రిలయన్స్ ఫ్రెష్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే అందులో కొన్ని షేర్లను నారా భువనేశ్వరి తన వద్దే ఉంచుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హెరిటేజ్ ఫుడ్స్ స్థిరమైన వృద్ధిని కొనసాగించడంతో నారా భువనేశ్వరి షేర్ల విలువ పెరిగినట్టు తెలుస్తోంది. ఇక గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తన ఆస్తుల విలువను పలు సందర్భాల్లో ప్రకటించారు. నారా లోకేష్ కూడా ఇదే పంథాను అనుసరించారు. నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తులు పెరగడం పట్ల అధికార వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.. అలా ఆస్తులు పెరగాలంటే ఏం చేయాలో చెప్పాలని సవాళ్లు విసురుతున్నారు.