TDP And Janasena Alliance: ఏపీలో వైసీపీకి డేంజర్ బెల్ మోగుతోంది. ఆ పార్టీ భావిస్తున్నట్టు వై నాట్ 175 వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఇప్పుడున్న 151 సీట్లు కూడా నిలుపుకునే ఛాన్స్ లేదని తేలుతోంది. దాదాపు 80 స్థానాలను కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ 68 స్థానాలకే పరిమితం కానుందని ఆత్మసాక్షి సర్వేలో వెల్లడయింది. అయితే ప్రధాన పార్టీల గెలుపోటముల మధ్య వామపక్షాలతో పాటు బిజెపి క్రియాశీలక పాత్ర పోషించనున్నాయని తేలింది. ప్రధానంగా వామపక్షాలను కలుపుకొని వెళ్తే జనసేన, టిడిపి కూటమికి భారీ విజయం దక్కనుందని తేలడం విశేషం.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్.. అనంతరం యూత్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 12 నుంచి 30 వరకు ఆత్మసాక్షి ” మూడ్ ఆఫ్ ఏపీ” పేరిట నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. టిడిపి, జనసేన పొత్తుతో 50 శాతం ఓటింగ్ సాధిస్తాయని సర్వేలో తేలింది. అదే వామపక్షాలతో కలిసి ముందుకెళ్తే 54 శాతం ఓట్లు రావచ్చని స్పష్టమైంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ కూటమిలో కలిస్తే వైసీపీ పైచేయిగా నిలుస్తుందని తేలడం విశేషం. చంద్రబాబుపై సింపతి పెరగడంతో పాటు.. పవన్ బలం తోడు కావడంతో కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది.
మొత్తం నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ సర్వే చేసినట్లు సమాచారం. ఎవరికి వారు విడిగా పోటీ చేస్తే.. తెలుగుదేశం పార్టీకి 86, వైసీపీకి 68, జనసేనకు ఆరు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే టిడిపికి 95, జనసేనకు 13, వైసిపి 60 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అదే తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తే ఆ కూటమి 75 స్థానాలకే పరిమితం కానున్నట్లు తేలింది. 100 సీట్లతో వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వే తేల్చింది. టిడిపి, జనసేనతో వామపక్షాలు కలిస్తే కూటమికి 115 నుంచి 122 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి 56 నుంచి 58 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే తేల్చింది.
జనసేన, టిడిపి బిజెపిని కలుపుకెళ్తే డేంజర్ బెల్స్ మోగడం ఖాయమని సర్వేలో తేలడం విశేషం. అదే వామపక్షాలను కలుపుకొని వెళ్తే సానుకూల ఫలితాలు వస్తాయని తేలడం విస్తు గొలిపే విషయమే. చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ స్నేహాన్ని కోరుకుంటున్నారు. అయితే ప్రజల్లో మాత్రం బిజెపి కంటే వామపక్షాలపై సానుకూలత రావడం ప్రాధాన్యతాంశంగా మారింది.బిజెపి వైసీపీకి అనుకూలమన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. తాజా పరిణామాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపియే కారణమని ఎక్కువమంది అనుమానిస్తున్నారు. విభజన హామీల పరిష్కారంతో పాటు రాజకీయ అంశాలు ప్రజలపై ప్రభావం చూపుతున్నట్లు ఆత్మసాక్షి సర్వేలో వెల్లడయ్యింది . మొత్తానికైతే వామపక్షాలపై ప్రజలు సానుకూలత చూపడం విశేషం.