TDP Janasena First List: ఏపీలో పొత్తుల లెక్కలు కొలిక్కి రావడం లేదు. టిడిపి, జనసేన కు సంబంధించి తొలి జాబితా బయటకు వచ్చింది. టిడిపికి సంబంధించి 94 మంది అభ్యర్థులను, జనసేనకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేస్తూ వారి పేర్లను ప్రకటించారు.బిజెపి రానుండడంతో మిగతా అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అయితే దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఒకవైపు త్యాగాలు చేయాల్సి ఉండగా.. మరోవైపు ఆ పార్టీలోకి రావాల్సిన నాయకులకు సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో నేతల తాకిడితో ఉక్కిరిబిక్కిరి ఎదురుకాక తప్పదు. అది నేతల మధ్య అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిన నేతలను జనసేనలోకి పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ టిక్కెట్లు ఇప్పించుకునేందుకే జనసేన కు సంబంధించి 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. కానీ పార్టీ ఓడిపోయింది. దీంతో ఆయన స్తబ్దతగా ఉండిపోయారు. ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు సహకారంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించారు. అటువంటి కొణతాల రామకృష్ణ సడన్ గా జనసేన లో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ సీటుకు జనసేన అభ్యర్థిగా ఖరారు అయ్యారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలుగుదేశం పార్టీ వైపు చూశారు. కానీ ఆయన మనసు మార్చుకున్నారు. జనసేనలో చేరారు. మచిలీపట్నం ఎంపీ సీటును ఆయనకు కేటాయిస్తారని తెలుస్తోంది.
సానా సతీష్ అనే పారిశ్రామికవేత్త లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. టిడిపికి తెర వెనుక సేవలు అందించారు. ఆయన అనూహ్యంగా జనసేనలో చేరారు. ఆయనకు కాకినాడ పార్లమెంట్ సీటు ఇస్తారని టాక్ నడుస్తోంది. కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ మధ్యన వైసీపీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. ఆయన తన పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీలో చేరతారని బలమైన ప్రచారం జరిగింది. ఆయన సైతం జనసేనలో చేరారు. నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని ఆయనకు కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే ఇలా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న నాయకులకు చంద్రబాబు అడ్డు చెబుతున్నట్లు తెలుస్తోంది. 2014లో బిజెపితో పొత్తు సమయములో సైతం ఇదే ఫార్ములాను చంద్రబాబు అనుసరించారు. టిడిపిలో చేరాల్సిన కామినేని శ్రీనివాసును బిజెపిలోకి పంపించారు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మంత్రి పదవి సైతం ఇచ్చారు. తన మనుషులను భాగస్వామ్య పార్టీల్లో చేర్చి.. ఎమ్మెల్యేలుగా చూసుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పవన్ తో సైతం ఇదే పితలాటకం చంద్రబాబు ఆడుతున్నారు. అయితే దీనిని పవన్ గ్రహిస్తున్నారో? లేకుంటే పవన్ కు తెలిసే ఇలా చేస్తున్నారో? గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోదించాలని భావిస్తున్నారో? అన్నది తెలియాల్సి ఉంది.