AP Assembly Election Results 2024: ఉత్తరాంధ్రలో టిడిపి కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్వీప్ దిశగా ముందుకు సాగుతోంది. కనీసం ఆ రెండు జిల్లాల్లో వైసీపీ బోణీ కొట్టలేదు. కీలక నేతలుగా ఉన్నధర్మాన ప్రసాదరావు,తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ సైతం ఓటమి బాటలో ఉన్నారు. మరో మంత్రి సిదిరి అప్పలరాజు సైతం ఓడిపోనున్నారు. ఆ రెండు జిల్లాల్లో సాలిడ్ విజయం దిశగా కూటమి ముందుకు సాగుతుండడం విశేషం.
టిడిపి ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది.p 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనం సమయంలో సైతం శ్రీకాకుళం అండగా నిలిచింది. కానీ గత ఎన్నికల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న తెలుగుదేశం పార్టీ గట్టి ఫైట్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను.. ఎనిమిదింటిని కైవసం దిశగా కొనసాగుతోంది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస లో టిడిపి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎచ్చెర్ల లో బిజెపి అభ్యర్థి భారీ ఆధిక్యత దిశగా కొనసాగుతున్నారు.
విజయనగరం జిల్లాలో సైతం టిడిపి కూటమి హవా నడుస్తోంది. జిల్లాలో అన్ని స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వెనుకబడ్డారు. శృంగవరపుకోట, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, రాజాంలలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతున్నారు. మొత్తానికైతే ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాల్లో కూటమి అభ్యర్థులు దాదాపు స్వీప్ చేయడం విశేషం.