Deccan Chronicle Attack: విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయం పై దాడికి కారణమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ దినపత్రికలో ప్రత్యేక కథనం వచ్చింది. దీనిపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పత్రిక కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి. పార్టీ అనుబంధ టిఎన్ ఎస్ఎఫ్, తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు.ఈ క్రమంలో కార్యాలయం బోర్డును దగ్ధం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
* ఎగసిపడిన ఉద్యమం..
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం గత కొన్నేళ్లుగా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేసింది. తప్పకుండా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని సాక్షాత్ కేంద్రమంత్రులు చాలాసార్లు ప్రకటించారు. దీనిపై ఉద్యమం పతాక స్థాయికి చేరింది. బిజెపి మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అయితే అప్పట్లో నిరసన కార్యక్రమాల్లో వైసీపీ సైతం పాల్గొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో నాడు అధికారంలో ఉన్న వైసిపి విఫలమైందని విపక్షాలుగా ఉన్న టిడిపి, జనసేన ఆరోపించాయి. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. వైసిపి అప్పట్లో ఆత్మ రక్షణలో పడింది. అందుకే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో క్రియాశీలకంగా కూడా వ్యవహరించింది.
* ఎన్నికలతో పక్కన పెట్టిన బిజెపి..
ఎన్నికల్లో టిడిపి, జనసేన తో కలిసి బిజెపి పోటీ చేసింది. ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ చేరింది. ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టింది. ఇప్పట్లో ప్రైవేటీకరణ ఉండదని సంకేతాలు పంపింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నట్టుండి పావులు కదపడం ప్రారంభించింది.స్టీల్ ప్లాంట్ అంశాన్ని సమీక్షించేందుకు విశాఖకు మంత్రి కుమారస్వామి రావడంతో కలకలం రేగింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డెక్కన్ క్రానికల్ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని, యూటర్న్ తీసుకుందన్నది ఈ కథనం సారాంశం. చంద్రబాబు రాష్ట్ర అవసరాల దృష్ట్యావిశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ కథనంలో రాసుకొచ్చారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైరల్ అంశం గా మారింది. అయితే వైసిపి పని కట్టుకొని ఈ కథనం రాయించిందని.. డెక్కన్ క్రానికల్ వైసిపి అస్మదీయ పత్రిక అని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులకు దిగాయి. పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపే క్రమంలో బోర్డుకు నిప్పంటించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
* మంత్రి లోకేష్ స్పందన..
డెక్కన్ క్రానికల్ కార్యాలయం పై టిడిపి దాడి విషయంలో మంత్రి లోకేష్ స్పందించారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా డెక్కన్ క్రానికల్ ఈ కథనాన్ని ప్రచురితం చేసిందని ఆరోపించారు. వైసిపి ఆదేశాల ప్రకారం ఈ కథనాన్ని వండి వార్చిందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. పక్షపాతంతో కూడిన వార్తలను రాసిన బ్లూ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
* ఖండించిన మాజీ సీఎం జగన్..
కాగా ఈ ఘటనపై విపక్షనేత జగన్ సైతం స్పందించారు. ఈ దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. టిడిపిని గుడ్డిగా అనుసరించకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించిన మీడియాను అణచివేయడానికి టిడిపి చేసిన మరో ప్రయత్నంగా జగన్ కామెంట్ చేశారు. కూటమి పాలనలో ప్రతిరోజు రాష్ట్రంలో అప్రజాస్వామ్య చర్యలు నమోదవుతున్నాయని.. దీనికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ దుమారం రేగుతున్న నేపథ్యంలో.. డెక్కన్ క్రానికల్ కార్యాలయం పై దాడి ఆందోళన రేకెత్తిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tdp activists attack on deccan chronicle
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com