YS Jagan Arrest soon: జగన్ (YS Jagan Mohan Reddy )చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్టు తప్పదా? దీనికోసం గట్టిగానే ప్రయత్నాలు మొదలయ్యాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టు అయ్యారు. మొత్తం 40 మందికి పైగా నిందితులకు గాను.. చాలామంది పరారీలో ఉన్నారు. తాజాగా ఏ 4 గా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయనకు ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి అయితే వెనుక ఉండి నడిపించింది మాత్రం మిధున్ రెడ్డి అని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. మద్యం పాలసీ తయారీ, డిస్టలరీలు, సరఫరాదారుల నుంచి తోటి నిందితులతో కలిసి నగదు అందుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా చాలామంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని.. లోతైన దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు స్పష్టం చేశారు.
ప్రచారం మొదలుపెట్టిన కూటమి నేతలు..
మరోవైపు మద్యం కుంభకోణంలో( liquor scam) మాజీ సీఎం జగన్ పాత్ర ఉందని కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు జనం బాట పట్టారు. మద్యం కుంభకోణం అనేది దేశంలోనే పెద్దదని.. భారీ అవినీతికి పాల్పడ్డారని.. అదే సొమ్మును ఎన్నికల్లో వాడుకున్నారని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం కుంభకోణం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఏ5 గా ఉన్న విజయసాయిరెడ్డిని టచ్ చేయకపోవడం గమనార్హం. అయితే ఆయన ఇచ్చిన ఆధారాలతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: Vijayasai Reddy Liquor Scam: విజయసాయిరెడ్డి అరెస్టు తప్పదా?
వైసీపీ అభ్యర్థుల కోసమే..
అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ అభ్యర్థులకు నగదు ఇచ్చేందుకు.. ఈ మద్యం కుంభకోణం జరిగిందని సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మద్యం పాలసీ తయారీ, డిష్టలరీలు, సరఫరాదారులతో పలుమార్లు సమావేశాలు జరిగినట్లు స్పష్టం అవుతుంది. ఇందులో నేరుగా జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం లేకపోయినా.. ఇదంతా రాజకీయ ప్రయోజనం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేందుకు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ప్రత్యేక దర్యాప్తు బృందం తన వాదనలు వినిపిస్తోంది. అంటే అంతిమ లబ్ధిదారుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని అభియోగాలు మోపే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం కంటే మద్యం కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయనుంది కూటమి. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీనిపై విస్తృత ప్రచారం అన్నది టార్గెట్ గా తెలుస్తోంది. తద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా సానుభూతి వర్కౌట్ కాకూడదన్నది ప్లాన్ గా సమాచారం. దాదాపు 3800 కోట్ల రూపాయలు ఈ కుంభకోణం ద్వారా చేతులు మారింది. అదే విషయాన్ని సిట్ చెబుతోంది. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అధికారిని ఐఏఎస్ హోదా ఇస్తామని చెప్పి కుంభకోణానికి పాల్పడ్డారని సిట్ నిన్ననే కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఇంకా అరెస్టులు ఉన్నాయని కోర్టుకు చెప్పడం ద్వారా పరోక్ష సంకేతాలు ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. చూడాలి ఎటువంటి కీలక అరెస్టులు ఉంటాయో!