Open Heart With RK : “వ్యాపారాల మీద దెబ్బ కొట్టాడు. ఆస్తులను మావి కాకుండా చేశాడు. రాజకీయంగా పాతాళానికి తొక్కేశాడు. గత్యంతరం లేక ఇలా జుట్టు, గడ్డం పెంచుకొని తిరుగుతున్నాను. ఈసారి అధికారంలోకి రాకుంటే ఇవి కూడా మిగలవు కావచ్చు” ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు అనంతపురం జిల్లాలో జెసి బ్రదర్స్ గా పేరుపొందిన వారిలో చిన్నవాడు జెసి ప్రభాకర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ రాజకీయాలను శాసించిన ఆయన ఇప్పుడు ప్రాధాన్యం లేని పాత్రగా మిగిలిపోయారు. రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన ఈయన ఎందుకు ఇలా మారిపోయారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ఆయనను ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్లో విడుదలైంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
తల వంచేది లేదు
నేను రాయలసీమలో పుట్టాను. బకెట్లలో బాంబులు విసిరాను. కానీ ఏనాడూ ఎవరి ముందు తలవంచింది లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు సంతకాలు సేకరించినప్పుడు బాధనిపించింది. తర్వాత జగన్ పార్టీ పెట్టినప్పుడు రమ్మన్నారు. అన్నా అని పిలిచినవారు తలవంచాలి అన్నారు. కుదరదు అన్నాను. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది. మాకు గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. ఒక టర్మ్ అధికారంలోకి వచ్చాం. మళ్లీ అధికారాన్ని కోల్పోయాం. కానీ ఈ నాలుగేళ్లలో రాజకీయాలు చాలా కలుషితమయ్యాయి” అని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు
“ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పాల్పడుతూనే ఉన్నారు. జగన్ దెబ్బకు నా వ్యాపారాలు మొత్తం క్లోజ్ అయ్యాయి. నా ఆస్తులు మొత్తం నాకు కాకుండా పోయాయి. ఎవరో కేతిరెడ్డి లాంటివాడు వచ్చి నా ఇంట్లో తొడ కొట్టాడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ ఎందుకో విరమించుకున్నా. అప్పటి నుంచి గడ్డాలు, మీసాలు పెంచుకొని తిరుగుతున్నా. ఇప్పుడు ఇక వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మా ప్రభుత్వం రాకపోతే జగన్ మాకు గోచి గుడ్డ కూడా మిగిలనివ్వడు. ఇక నా భార్య ను సాకాలి కాబట్టి లారీ క్లీనర్ గా పనిలోకి వెళ్తా. అంతకుమించి వేరే మార్గం లేదు.” అని ప్రభాకర్ రెడ్డి రాధాకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ప్రోమో లోనే ఈ స్థాయిలో హాట్ హాట్ సమాధానాలు వినిపించిన నేపథ్యంలో.. పూర్తి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.. ఈ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుంది.
