Swami Swaroopananda : రాజ గురువుగా ముద్రపడ్డారు విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద. గత ఐదు సంవత్సరాలుగా ఒక వెలుగు వెలిగారు. వైసిపి అధికారానికి దూరం కావడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు స్వామీజీ. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని కూటమి వెనక్కి తీసుకుంది. గతం మాదిరిగా పీఠానికి రాజకీయ కళ తప్పింది. గతం మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రోటోకాల్ దక్కడం లేదు స్వామీజీ వారికి. దేవాదాయ శాఖలో కూడా ప్రాధాన్యత తగ్గింది. దీంతో ఏపీ ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని స్వామీజీ భావిస్తున్నారు. హైదరాబాద్ కోకాపేట్ లో కానీ.. ఇతర ప్రాంతాల్లో కానీ కార్యకలాపాలు ప్రారంభించాలని స్వామీజీ భావిస్తున్నారు. దీంతో విశాఖ శారదా పీఠం కళ తప్పనుంది.
* సెక్యూరిటీ సరెండర్
తాజాగా స్వామీజీ తన సెక్యూరిటీని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో వై క్యాటగిరి భద్రత కల్పించేవారు స్వామీజీకి. పీఠాధిపతి తో పాటు ఉత్తరాధికారికి గన్ మెన్ ఉండేవారు. వీరు పీఠం విడిచి ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. తిరుపతిలో అయితే క్యాబినెట్ హోదాతో సమానమైన భద్రత కల్పించేవారు. గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక వై కేటగిరి భద్రతను నిలిపివేసింది ప్రభుత్వం. ప్రస్తుతం వన్ ప్లస్ వన్ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు ఈ భద్రతను కూడా ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ ఏపీ డీజీపీని కోరారు.
* ఆ భూములు వెనక్కి
ఇటీవల వైసిపి సర్కార్ శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని.. కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భీమిలిలో 300 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని 15 లక్షలకే ఇచ్చింది వైసీపీ సర్కార్. అయితే అందులో వాణిజ్య అవసరాలకు వినియోగించాలని శారదాపీఠం భావించింది. ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి. అధికారం తారు మారయింది. ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరోవైపు స్వరూపానంద కు ప్రాధాన్యత తగ్గింది. అందుకే స్వామీజీ తెలంగాణ కానీ.. రిషికేశ్ కానీ వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వైసీపీ హయాంలో రాజకురువుల ఓ వెలుగు వెలిగిన స్వరూపానంద రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోనున్నారన్నమాట.