Tirupati laddu Controversy : తిరుమలలో వివాదంపై విచారణ కొనసాగుతోంది. అత్యున్నత దర్యాప్తు బృందం సిట్ రంగంలోకి దిగింది. కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. నెయ్యి తయారీ కేంద్రాల నుంచి సరఫరా సంస్థల వరకు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లోనూ సైతం దర్యాప్తు మొదలుపెట్టారు. కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెయ్యి రవాణా చేసి ట్యాంకర్ల విషయంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సీసీటీవీ కెమెరా ఉటేజ్ ద్వారా సిట్ కీలక ఆధారాలను సేకరించింది. ఈ విచారణకు సంబంధించి రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుమల శ్రీవారు లడ్డు తయారీకి సంబంధించి.. నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకున్న సంస్థల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు సిట్ అధికారులు. నీ సరఫరా కోసం టీటీడీతో ఏఆర్ డైరీ సమస్త ఒప్పందం చేసుకుంది. కానీ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ అంచనాకు వచ్చింది. తాజా విచారణలో సైతం ఇదే అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
* రికార్డుల్లో స్పష్టం
వైష్ణవి డైరీ నుంచి నెయ్యి తీసుకుని వచ్చి.. ఏఆర్ డైరీ నుంచి సరఫరా చేసినట్లు రికార్డులు చూపుతున్నాయి. దీంతో సంబంధిత ట్యాంకర్ల డ్రైవర్ల సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ ట్యాంకర్లు రాకపోకలు సాగించే మార్గాల్లోని టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించనున్నారు. ఆ మార్గాల్లోని అన్ని చెక్పోస్టుల వద్ద రికార్డులను పరిశీలించారు.ట్యాంకర్లకు జిపిఎస్ ఉందా లేదా ఆరా తీశారు. ట్యాంకర్ల నెంబర్లు, డ్రైవర్ల వివరాలను సిట్ అధికారులు సేకరించారు.
* ల్యాబ్ నిర్ధారణ పత్రాల పరిశీలన
మరోవైపు నెయ్యి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ల్యాబ్ రిపోర్టులను సిట్ అధికారులు పరిశీలించనున్నారు. టీటీడీకి నెయ్యి సరఫరాకు సంబంధించి.. ఏ ఆర్ డైరీ నాణ్యతను నిర్ధారిస్తూ చెన్నైకి చెందిన ఎస్ఎంఎస్ ల్యాబ్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను సైతం సిట్ పరిశీలించింది. గత పది రోజులుగా జరుగుతున్న ఈ విచారణకు సంబంధించి ప్రాథమిక నివేదిక తయారయింది. ఇందులో కీలక ఆధారాలను సేకరించడంలో సిట్ సక్సెస్ అయ్యింది. మున్ముందు ఈ విచారణలో సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.