Sujana Chowdary: బిజెపి నేత సుజనా చౌదరి అసంతృప్తితో ఉన్నారా? అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాను అన్న బాధ ఆయనలో ఉందా? అందుకే అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారా? తనలో ఉన్న బాధను బయటపెట్టారా? అంటే అవునని సమాధానం వినిపిస్తాను. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గెలిచారు సుజనా చౌదరి. అప్పటినుంచి ఆయన సాధారణ ఎమ్మెల్యే గానే ఉండిపోయారు. ఏదేదో పదవులు ఆశించిన ఆయనకు అవి దక్కలేదు. దీంతో ఎమ్మెల్యేగా ఉండి పోవాల్సి వచ్చింది. అయితే మంత్రి పదవులకు సంబంధించి దారులు మూసుకుపోవడంతో ఆయనలో అసహనం పెరిగినట్లు తెలుస్తోంది.
* ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు..
మొన్న అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. ఆ సమయంలో కూటమి ఎమ్మెల్యేలే విపక్షపాత్రను పోషించారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఇటువంటి తరుణంలో బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆయనలో ఉన్న అసంతృప్తిని తెలియజేశాయి. అమరావతి రైతుల విషయంలో సరైన న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖ రుషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం పై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా మాట్లాడారు. తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు.
* టిడిపిలోనే సుదీర్ఘకాలం..
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు సుజనా చౌదరి. 2014లో టిడిపి అధికారంలోకి రాక మునుపే ఆయన రాజ్యసభ సభ్యుడు. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది. అలా ఐదేళ్లపాటు కేంద్ర మంత్రి హోదాలో ఒక వెలుగు వెలిగారు సుజనా చౌదరి. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. బిజెపిలో చేరారు. రాజ్యసభ రెన్యువల్ దక్కుతుందని ఆశించారు. కానీ అలా దక్కక పోయేసరికి మాజీ ఎంపీ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఎంపీ సీటును ఆశించారు. కానీ ఆయనకు ఎమ్మెల్యే అవకాశం దక్కింది. మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. అది కూడా దక్కలేదు. ఇప్పట్లో మంత్రి పదవి దక్కే చాన్స్ లేదు. అందుకే ఆయనలో అసంతృప్తి పెరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఎంత అసహనం వ్యక్తం చేసినా 2029 ఎన్నికల వరకు సుజనా చౌదరి వెయిట్ చేయాల్సిందే నన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?