AP BJP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. మిత్రపక్షాలుగా ఉంటూనే ఎవరికివారు ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైసీపీకి ( YSR Congress) భారీ ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు పార్టీల్లో చేరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణానికి 15000 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు సమకూరుస్తామని చెప్పుకొచ్చింది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,443 కోట్లు మంజూరు చేసింది. దీంతో పాటు రైలు, రవాణా ప్రాజెక్టులను సైతం మంజూరు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజల్లో ఒక రకమైన సానుకూలత కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో బిజెపి శ్రేణులకు దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది.
* కేంద్రం ఉదార సాయం
కేంద్ర ప్రభుత్వం( central government) పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో.. ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏపీ బీజేపీ కార్యవర్గాన్ని సరికొత్తగా రూపొందించి.. నూతన అధ్యక్ష నియామకం చేపడతారని తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం ఈ జూలై తో ముగియనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అధ్యక్షులను మార్చడం బిజెపిలో ఆనవాయితీ. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన కార్యవర్గాలను మార్చుతారు. అందులో భాగంగా ఏపీకి సైతం నూతన అధ్యక్షుడు వస్తారని తెలుస్తోంది.
* మెగా సానుకూలత
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) సైతం బిజెపి విషయంలో సానుకూలంగా ఉన్నారు. ఆయనను బిజెపిలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆయన మాత్రం బిజెపిలో చేరే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే చిరంజీవితో స్నేహం కొనసాగిస్తూనే కాపు సామాజిక వర్గానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గానికి ఈసారి అధ్యక్ష పీఠం ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. రాయలసీమకు ఛాన్స్ ఇస్తే మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
* రాయలసీమకు ఇవ్వాలనుకుంటే..
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy) బిజెపిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి ఆ నియోజకవర్గం వైసిపికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని తెలిసినా.. కిరణ్ కుమార్ రెడ్డి సాహసించి పోటీకి దిగారు. గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి చవిచూశారు. అయితే ఆయనకు బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రెడ్డి సామాజిక వర్గంతో పాటు తన పాత పరిచయాలను ఉపయోగించుకొని బిజెపికి కొత్త వైభవం తీసుకొస్తారని నమ్మకం ఉంది. రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ వచ్చే పరిస్థితి ఉంది.
* తెరపైకి సుజనా చౌదరి
మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి( Sujana Chaudhary ) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించి.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కేంద్రమంత్రిగా వ్యవహరించి చక్రం తిప్పిన ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఉండేందుకు ఇష్టపడడం లేదు. అదే బిజెపి పగ్గాలు అందిస్తే సముచిత స్థానం దక్కినట్లు అవుతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర నేత పివిఎన్ మాధవ్ సైతం బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఆశిస్తున్నారు. అయితే ఏపీకి వరుసగా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో బలపడడానికి ఇదే సరైన సమయమని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. వీలైనంత త్వరగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నియామకం పూర్తి చేయాలని చూస్తోంది.