YCP Part Time Leaders: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నారు. అది కూడా ఇక్కడ కాదు. పక్క రాష్ట్రంలో ఉండి 2029 ఎన్నికల్లో ఎలా గెలుపొందాలి అనే దానిపై వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. వారంలో మూడు రోజులపాటు తాడేపల్లికి వస్తున్నారు. మధ్యలో విదేశీ పర్యటనలతో పాటు విపత్తులు సమయంలో మాత్రం తాడేపల్లి ముఖం చూడడం లేదు. కానీ ఇటీవల మాత్రం తాడేపల్లి వస్తున్న క్రమంలో పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు బయలుదేరే వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అందులో వారాంతపు అంశాలపై ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలు కంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలకి ఎక్కువగా పరిమితం అవుతున్నారు. లోకేష్ ను ప్రమోట్ చేస్తున్నారు అంటూ కొన్ని రకాల విమర్శలు అయితే చేస్తున్నారు. కానీ బెంగళూరులోనే ఎక్కువగా గడుపుతుండడం పై సొంత పార్టీ శ్రేణుల్లో కూడా విస్మయం వ్యక్తం అవుతుంది.
పార్ట్ టైం నేతలంటూ ఆరోపణలు..
గతంలో పార్ట్ టైం నేతలు( part time leaders) అంటూ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసేవారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన చేస్తోంది కూడా అదే. 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు తో పాటు పవన్ ఎక్కువగా హైదరాబాదు నుంచి వచ్చేవారు. దానిని గుర్తు చేస్తూ పార్ట్ టైం లీడర్స్ అంటూ వ్యాఖ్యానించేవారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ విడిచి పెట్టడం లేదు. అయితే అక్కడ ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ఆ మధ్యలో ప్రచారం సాగింది. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. అందుకే అప్పట్లో అలా ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ ద్వారా చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అందుకే ఇప్పుడు సొంత అజెండాతో ముందుకు వెళుతున్నట్లు సమాచారం.
త్వరలో అనుకూల సర్వేలు..
బెంగళూరు యలహంక ప్యాలెస్ కు( Bangalore Yelahanka Palace ) నేషనల్ మీడియా ప్రతినిధులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు పేరు మోసిన మీడియా ఛానల్ ప్రతినిధులు ఎక్కువగా వస్తున్నట్లు బెంగళూరు వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2019 నుంచి 2024 మధ్య ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాతోనే టచ్ లో ఉండేవారు. ఓ పేరు మోసిన ఛానల్ అయితే ప్యాకేజీ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకే 2024 ఎన్నికల వరకు ఎటువంటి సర్వే నేషనల్ మీడియా చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు ఇచ్చేవి. కానీ ఎన్నికల ముంగిట వాటి పరిస్థితి మారింది. ఎందుకంటే ప్రజాభిప్రాయం చెప్పాలి. లేకుంటే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అందుకే వాస్తవ ఫలితాలు అప్పట్లో ఇచ్చాయి నేషనల్ మీడియా సంస్థలు. అయితే ఇప్పుడు అదే నేషనల్ మీడియా సంస్థలు ఎలాహంక ప్యాలెస్ కు క్యూ కడుతుండడంతో.. తప్పకుండా అనుకూల ఫలితాలతో సర్వే లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రెండేళ్ల కూటమి పాలనపై ఫలితాలు వెల్లడించినా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనితీరు మెరుగుపడిందని చెప్పినా అది యలహంక ప్యాలెస్ ఒప్పందాలేనని స్పష్టమవుతుంది.