Ramoji Rao : రామోజీరావు.. తెలుగు మీడియా మొఘల్. కొందరికి నచ్చొచ్చు. ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఎంతో మందికి ఉపాధినిచ్చినవాడు. ఈనాడు పెట్టి విలేకరులను తయారుచేసినవాడు. ఇవాల్టికి ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మొత్తం ఎప్పుడో ఒకప్పుడు ఈనాడులో పనిచేసిన వారే. అయితే రామోజీరావుకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి అతని అడుగులు మహాపాతకాలుగా కనిపిస్తాయి.. రామోజీరావు శిబిరంలో ఉండి.. ఆయనకు అనుకూలంగా ఆలోచిస్తే మాత్రం తన దూరదృష్టి కనిపిస్తుంది. ప్లానింగ్, ఇతర వ్యవహారాలు వారెవా అనిపిస్తాయి.. అనారోగ్యంతో రామోజీరావు కాలం చేశాడు గాని.. తను వయసులో ఉన్నప్పుడు.. పత్రికను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినప్పుడు.. “ఆడిన ఆట” మామూలుది కాదు. అనితర సాధ్యుడు అనే పదం ముమ్మాటికి రామోజీరావుకు సరిపోతుంది.
ఈనాడు లేకుంటే..
ఈనాడు లేకుంటే ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ లేదు.. 9 నెలలు అధికారంలోకి వచ్చేది కాదు. దాని దూకుడుకు, దాని ప్రభ వెలిగేందుకు ముమ్మాటికీ ఈనాడు కారణం. అప్పుడే కాదు చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు.. పార్టీని స్థాపించిన మామను పక్కన పెట్టినప్పుడు.. అప్పుడు కూడా రామోజీనే చుక్కాని. కులం, స్వార్థం, కాంగ్రెస్ అంటే మంట.. కారణాలు ఏమైనా గాని.. రామోజీరావు మంకుపట్టుపడితే అది ఏదైనా జరిగిపోవాల్సిందే. అప్పట్లో అలా ఉండేది మరి అతని వ్యవహార శైలి. రామోజీరావు తెలుగు రాజకీయాల్లోకి వేలు ఎందుకు పెట్టాడు? తెలుగు రాజకీయాలను అతడు ఎలా శాసించాడు? అనే సంక్లిష్ట ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం తెలుగు వాడి ఆత్మ గౌరవం.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. నాడు ఈనాడు సంస్థల్లో పని చేసిన సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ ఈ విషయాన్ని ఎక్కడో ఒకచోట ప్రస్తావిస్తూనే ఉంటారు.
తెలుగు వాడి ఆత్మగౌరవం..
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా కెరియర్ ఫెడ్ అవుట్ అవుతోంది. ఆయన వయసు కూడా మల్లుతోంది. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ కు రాజ్యసభ ఇవ్వకపోవడంతో.. అవమాన భారంతో కాంగ్రెస్ పార్టీపై రగిలిపోతున్నారు. కారాలు మిరియాలు నూరుతున్నారు.. కమ్మ కుల పెద్దలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి పొలిటికల్ స్పేస్ ఉందని గుర్తించారు. సొంత పార్టీ పట్టాలని ఒక ఆలోచనకు వచ్చారు.. అప్పట్లో ఈనాడు రోజుకో సంచలనంగా ఉండేది. గజ్జల మల్లారెడ్డి వంటి వారు ఈనాడును తిరుగులేని స్థాయిలో నిలబెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రామోజీరావు కూడా ప్రతిరోజూ పత్రిక నిర్వహణ, వార్తలు, ఇతరత్రా వ్యవహారాలపై సమీక్ష నిర్వహించేవారు. అందులో తట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టేవారు. అలా ఒకరోజు సమీక్ష నిర్వహిస్తుండగా రామోజీరావుకు అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికినట్టు.. ఒక ఛాన్స్ లభించింది.. రామోజీరావుది మామూలు బుర్ర కాదు కదా.. అప్పట్లో రాజీవ్ గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు వచ్చారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజీవ్ గాంధీకి స్వాగతం పలికేందుకు అంజయ్య విమానాశ్రయం వెళ్ళాడు. అక్కడ సహజంగానే కార్యకర్తల హంగామా తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాతావరణం లేకుంటే ఆశ్చర్య పోవాలి.. ఆ హడావిడి చూసి రాజీవ్ గాంధీకి చిరాకెత్తింది. అంజయ్యను పక్కనపెట్టి హెలికాప్టర్లో.. తను పర్యటించాల్సిన ప్రాంతాలకు వెళ్లిపోయాడు. దీంతో అంజయ్య ముఖం చిన్న బుచ్చుకుంది.. ఈ ఫోటోలను ఈనాడు ఫోటో జర్నలిస్టు కేశవులు అద్భుతంగా తీశాడు. అప్పుడు ఈనాడు బ్యూరో చీఫ్ గా ఎం వి ఆర్ శాస్త్రీయ ఉండేవారు. ఎప్పటిలాగానే సాయంత్రానికి రామోజీరావు మీటింగ్ పెట్టారు..”సంచలనమైన వార్తలు ఏమున్నాయి” అంటూ అడిగారు. వాళ్ళు ఏదో చెప్పారు.. ఈలోగా కేశవులు తీసిన ఫోటోలు రామోజీరావు దృష్టికి వచ్చాయి. అదే మీటింగ్లో ఏడు నుంచి ఎనిమిది ఫోటోలు ఎంపిక చేసిన రామోజీరావు.. ఎడిటోరియల్ పెద్దలవైపు అలా చూశాడు.. వారికి రామోజీరావు లో ఉన్న అసలు భావం అర్థమైంది… అంతే తెల్లారి ఈనాడులో “తెలుగు వాడి ఆత్మ గౌరవానికి భంగం”అని హెడ్లైన్ పెట్టి.. అంజయ్య కు విమానాశ్రయంలో ఎదురైన అనుభవానికి సంబంధించిన ఫోటోలను ఒకే వరుసలో ప్రచురించారు. వాస్తవానికి తన భావాన్ని సిబ్బంది అర్థం చేసుకున్నారో? లేదో? అని రామోజీరావు ఆరోజు రాత్రి 11:30 నిమిషాలకు ఒక కాంగ్రెస్ నాయకుడిని వెంట వేసుకుని వచ్చి ఆఫీసులో పరిశీలించాడట. ఇదే విషయాన్ని ఎంవిఆర్ శాస్త్రి పలు సందర్భాల్లో చెప్పారు..
తెలుగుదేశం స్థాపనకు..
తెలుగు వాడి ఆత్మ గౌరవానికి భంగం అనే ఓ నినాదాన్ని, పొలిటికల్ ఐడియాలజీని అప్పటికప్పుడు రామోజీరావు సృష్టించాడు. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడమే ఎన్టీఆర్ చేయాల్సిన పని. రామోజీరావు అనుకొన్నట్టుగానే ఆ నినాదం ఒక డైనమేట్ లాగా పేలింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 9 నెలల లోనే ఎన్టీఆర్ కు అధికారం దగ్గరికి వచ్చింది.. అయితే అంత సఖ్యత సీనియర్ ఎన్టీఆర్, రామోజీరావుకు ఉన్న క్రమంలో.. ఇద్దరి మధ్య ఎందుకు చెడింది? ఎందుకు రామోజీరావు చంద్రబాబుకు ఆయాచిత ప్రోత్సాహం ఇచ్చారు? అనేది వేరే కథ.. ఈ వ్యవహారాన్ని చెప్పేందుకు సీనియర్ ఎన్టీఆర్ మన మధ్య లేడు. రామోజీరావు కాలం చేశాడు. చంద్రబాబు చెప్పలేడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు విప్పలేడు.. మొత్తానికి అదొక చిదంబర రహస్యం.
మీడియా వల్ల ఏమవుతుంది అనుకుంటే..
మీడియా వాళ్ళు ఏం చేయగలరు? యాడ్ బిస్కెట్స్ ఇస్తే కుక్కల్లాగా తోకలు ఆడిస్తారు.. ఇక నుంచి ఏం హీక గలరు అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సంక్లిష్ట ప్రశ్నలకు రామోజీరావు పదుల సంవత్సరాల క్రితమే స్పష్టమైన జవాబు చెప్పాడు. దూబగుంట రోషమ్మతో ఉద్యమం చేయించి ఉదయానికి చీకటిని పరిచయం చేశాడు. తన పత్రికలో దాసరి నారాయణరావును నిషేధించాడు… తొడలు కొడుతున్న “వార్త”ను కొడి గట్టేలా చేశాడు. సాక్షికి అందనంత ఎత్తులో నిలబడ్డాడు. పత్రికొక్కటి చాలు పదివేల సైన్యం అని వెనకటికి సీనియర్ జర్నలిస్టులు సూత్రీకరిస్తే.. దానిని రామోజీరావు “పత్రికొక్కటి చాలు పదివేల పచ్చ సైన్యం” అనేలాగా మార్చేశాడు. తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈనాడును తన అనుబంధ విభాగంగా మార్చేశాడు.. ఇప్పుడంటే టీవీలు, చానల్స్ డప్పులు కొట్టే పోతురాజుల్లాగా మారిపోయాయి కానీ.. వాటి వెనుక రామోజీరావు లాంటి బుర్ర ఉంటే.. కథ వేరే విధంగా ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Special story on ramoji rao who changed telugu politics with eenadu media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com