AP Assembly Elections: పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జట్టుగా ఉన్నారు. త్వరలో తమకూటమిలోకి బిజెపి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి సీట్ల కేటాయింపుకు సంబంధించి చర్చించారు. సరే అది ఎంతవరకు వచ్చిందనేది ఇంతవరకు బయట ప్రపంచానికి తెలియదు. ఇది ఇలా ఉంటే.. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి నేనొక్కడినే అంటున్నారు. దేనికైనా సిద్ధమని సవాల్ విసురుతున్నారు. ప్రజలను మాత్రమే తాను నమ్ముకున్నానని.. తన బలమని విశ్వసిస్తున్నారు. 2019 ఎన్నికల్లో హోదా సాధిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడటం లేదు. ఆగమేఘాల మీద ఇప్పుడు డీఎస్సీ ప్రకటించారు. దీనిపై నిరుద్యోగుల నుంచి ఆయన ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు ఇలా ఉంటే నేనున్నాను అంటూ షర్మిల తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన అన్నపై విమర్శలు చేస్తున్నారు. పాలన బాగోలేదని పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడంతో గతంలో పనిచేసిన వృద్ధ నాయకులు మొత్తం హస్తం గూటికి చేరుతున్నారు.
ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే పేరుతో పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులకు టార్గెట్లు విధించడంతో వారు భారీగానే జన సమీకరణ చేస్తున్నారు. గతంలో వై నాట్ 175 అని గట్టిగా నినదించిన జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడేమో మిమ్మల్నే నమ్ముకున్నాను.. మళ్లీ అధికారం ఇస్తే మరింత మంచి చేస్తానని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అవకాశవాద పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని.. నేను మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నానని ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు విద్య, వైద్యం వంటి రంగాల్లో కీలక మార్పులు సాధించానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమి వ్యవహారం మరో విధంగా ఉంది. మొదట్లో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరూ అనుకున్నారు. జనసేన ఎన్డీఏ కూటమిలో ఉండటంతో.. కచ్చితంగా బిజెపి సపోర్ట్ కావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల చంద్రబాబు నాయుడు అయిననూ పోవలెను హస్తినకు అనే తీరుగా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో బిజెపి పెద్దలను కలుస్తున్నారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ టిడిపి అనుకూల మీడియా మాత్రం చంద్రబాబును హీరోగా చూపించి వార్తలు రాస్తోంది. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయో తెలియకపోయినప్పటికీ ఇప్పటికైతే వాతావరణం టిడిపికి అనుకూలంగా ఉందని పచ్చ మీడియా ఊదరగొడుతోంది. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావడంతో.. ఆయనను చివరిసారి ముఖ్యమంత్రి చేయాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు మునుడు దాకా కాపు ఓటర్లను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు గేరు మార్చుతున్నట్టు తెలుస్తోంది. అధికంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు.. కొన్ని నియోజకవర్గాలను కూడా అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక బిజెపి కూడా కొన్ని స్థానాల విషయంలో పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.. ఇన్ని పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ దిగినన్ని మెట్లు దిగుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఈసారి ఆయన విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. సర్వే సాకు చూపి చాలామందిని ఇంటికి సాగనంపుతున్నారు. ఇటువారిని అటు..అటు వారిని ఇటు అన్నట్టుగా.. నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందనేది చూడాల్సి ఉంది.. మరోవైపు సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇంకా కసరత్తు పూర్తి కాకపోవడంతో అటు జనసేన టిడిపి క్యాడర్ మల్ల గుల్లాలు పడుతోంది.. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనుకుంటే.. ఇప్పటివరకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే తప్ప చెప్పుకోదగ్గ పెద్ద స్థాయి నాయకులు ఆ పార్టీలో చేరలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హోదా సాధిస్తామని షర్మిల అంటున్నారు. ఇలా ఎవరికి వారు అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో.. ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీలో రాజకీయాలు ఎలా ఉంటాయో మరి??