HomeతెలంగాణMedigadda Barrage: నల్లగొండకు కారు.. మేడిగడ్డకు సర్కారు!

Medigadda Barrage: నల్లగొండకు కారు.. మేడిగడ్డకు సర్కారు!

Medigadda Barrage: తెలంగాణలో నీళ్ల పంచాయితీ రచ్చ రంబోలా అవుతోంది. నిన్నటి వరకు ప్రెస్‌మీట్లు.. అసెంబ్లీ చర్చలతో గరం గంగా సాగుతున్న లొల్లి.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం ద్వారా సర్కార్‌ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, బీర్‌ఎస్సే ఇటు ఉత్తర తెలంగాణకు, అటు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందని సర్కారు ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఎలా కుంగిపోయిందో తెలంగాణ ప్రజలకు చూపించేందుకు ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను మంగళవారం(ఫిబ్రవరి 13న) మేడిగడ్డకు తీసుకెళ్లాని నిర్ణయించింది. ఇక కారు పార్టీ అధినేత కేసీఆర్‌ దక్షిణ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు నల్లగొండలో మంగళవారమే(ఫిబ్రవరి 13న) సభ నిర్వహించబోతున్నారు.

ఎమ్మెల్యేలతో మేడిగడ్డకు..
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం మేడిగడ్డకు బయల్దేరుతున్నారు. మొదట అసెంబ్లీకి హాజరై అక్కడి నుంచే ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు వచ్చే ఎమ్మెల్యేలతో బయల్దేరనున్నారు. అక్కడే కుంగిన బ్యారేజీని పరిశీలిస్తారు. సుమారు రెండు గంటలపాటు మేడిగడ్డలోనే గడుపుతారు. తర్వాత అక్కడే కాళేశ్వరం పేరుతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు ఎంత నష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు కలిగిన లాభమెంత, నష్టం ఎంత, ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలు, విజిలెన్స్‌ ఇచ్చిన మధ్యంతర నివేదికపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఎంత నష్టం చేశాడు. ఎలా మోసం చేశాడో తెలియజేసేందుకే ఈ మేడిగడ్డ యాత్ర చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. అందరూ రాబాలని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కొత్తగా చూసేంది ఏముందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేలను తీసుకుపోవడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని, సీబీఐని తీసుకెళ్లాలని బీజేపీ సూచించింది.

నల్లగొండలో గులాబీ సభ..
ఇక కృష్ణ నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. తాముపదేళ్లు కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించకుండా కాపాడామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు. ఈ విషయమై సోమవారం(ఫిబ్రవరి 7న) అసెంబ్లీలో వాడీ వేడి చర్చ కూడా జరిగింది. బీఆర్‌ఎస్‌ పాలనలోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈమేరకు నీటిపారుదల శాఖ సెక్రెటరీగా స్మితాసబర్వాల్‌ లేఖ రాశారని తెలిపారు. ఈమేరకు కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు కేసీఆర్‌ అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఆ చొరవతోనే ఎన్నికల రోజు జగన్‌ తన పోలీసులను నాగార్జునసాగర్‌పైకి తుపాకులతో పంపించాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఇలా ఎవరికివారు తప్పు తమది కాదంటే తమది కాదని పేర్కొంటూ ఎదుటివారిపై నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పక్షం మేడిగడ్డకు, ప్రతిపక్షం నల్లగొండలో సభలు నిర్వహించనుండడంతో ఇప్పుడు నీటి పంచాయతీలో మరింత మంటలు పుట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular