Homeఆంధ్రప్రదేశ్‌Ayyannapatrudu Chintakayala: అచ్చిరాని స్పీకర్ పదవి.. అదుపు తప్పుతున్న సీనియర్ నేతలు.. తాజాగా అయ్యన్న కూడా.

Ayyannapatrudu Chintakayala: అచ్చిరాని స్పీకర్ పదవి.. అదుపు తప్పుతున్న సీనియర్ నేతలు.. తాజాగా అయ్యన్న కూడా.

Ayyannapatrudu Chintakayala: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారి మాటలు సమాజంపై విపరీతంగా ప్రభావం చూపుతాయన్న విషయాన్ని గ్రహించుకోవాలి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో( Andhra Pradesh) ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా శాసనసభ స్పీకర్లుగా వ్యవహరిస్తున్న వారు వివాదాస్పదం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో గత మూడుసార్లు అనూహ్యంగా స్పీకర్లుగా సీనియర్ నేతలను ఎంపిక చేసుకున్నాయి ఆయా ప్రభుత్వాలు. పేరుకే రాజ్యాంగబద్ధ పదవి కానీ.. పార్టీల ఆదేశాలు ఉంటాయి. ఆశ్రిత పక్షపాతం కూడా ఉంటుంది. అటువంటి పదవులకు సీనియర్లు అయితే న్యాయం చేస్తారని అధికార పార్టీలు భావిస్తున్నాయి. కానీ ఆ పదవులు సీనియర్లకు భారంగా మారుతున్నాయి. అటు అధికార పార్టీ ఆదేశాలు పాటించలేక.. ఇటు సొంత నిర్ణయాలు తీసుకోలేక స్పీకర్లుగా వ్యవహరించేవారు చాలా ఒత్తిడికి గురవుతుంటారు. కొందరికైతే స్పీకర్ గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. అధికారానికి దూరమైన తర్వాత కూడా వెంటాడుతుంటాయి. ఇదే మాదిరిగా కోడెల శివప్రసాదరావుకు వెంటాడినట్లు కథనాలు ఉన్నాయి. ఆయన పరువుకు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

* కోడెల విషాదాంతం
నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి శాసనసభ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు( Kodala sivaprasad Rao ) వ్యవహరించారు. ఆయన సీనియర్ నేత. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. మంచి మంచి మంత్రి పదవులు నిర్వర్తించారు. దూకుడు స్వభావం ఉన్న నేత. 2014లో గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు స్పీకర్ పదవి అప్పగించారు. అయితే బలమైన ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు కోడెల. శాసనసభలో జరిగిన పరిణామాలతో ఆయన అధికారపక్షం వైపు ఉన్నారని ఆరోపిస్తూ వైసిపి శాసనసభను బహిష్కరించింది. అదే వైసిపి 2019లో అధికారంలోకి రావడంతో తొలి టార్గెట్ అయ్యారు కోడెల. శాసనసభ ఫర్నిచర్ కు సంబంధించిన వివాదం అప్పట్లో హైలెట్ అయ్యింది. దీనికి తోడు అనేక రకాల పరిణామాలు వివాదాలుగా మారడంతో కోడెల మనస్థాపానికి గురయ్యారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఈ వివాదాలే కారణమని కుటుంబ సభ్యులు అనుమానించారు. టిడిపి శ్రేణుల్లో కూడా అదే అభిప్రాయం ఉంది.

* తమ్మినేని సీతారాం ఫెయిల్యూర్
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ నుంచి ఆమదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సీనియర్ నేత తమ్మినేని సీతారాం( tammaneni Sitaram) . ఆయన సైతం మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ అనూహ్యంగా తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎంపిక చేశారు. అయితే వైసిపి 151 సీట్లతో ఘనవిజయం సాధించింది. టిడిపి 23 స్థానాలకే పరిమితం అయింది. ఆ సమయంలో చంద్రబాబును టార్గెట్ చేసుకుంది వైసిపి. ఒకానొక దశలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. శాసనసభను బహిష్కరించి.. మళ్లీ సీఎం గానే సభలో అడుగు పెడతానని శపధం చేశారు. బయటకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి బోరున విలపించారు. కానీ ఆ సమయంలో సభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం వివాదానికి పుల్ స్టాప్ పెట్టకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం ఒకప్పటి సహచర నేత అని చంద్రబాబుపై గౌరవం చూపలేదు. ఒక సీనియర్ నేత స్పీకర్ గా ఉన్న హౌస్ లో.. ప్రతిపక్ష నేతకు అవమానం జరిగినా.. ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం విశేషం.

* అయ్యన్నపాత్రుడు పై గిరిజనులు సీరియస్
ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు( ayna patrudu ) స్పీకర్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు దూకుడు కలిగిన నేత. అటువంటి నేత మంత్రి పదవిని కోరుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు స్పీకర్ పదవి అప్పగించారు. అయితే ఆయన ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కూడా గిరిజనులపై. విశాఖ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పర్యాటక రంగ అభివృద్ధిపై కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరం అయితే.. గిరిజనుల ఉనికికి భరోసా కల్పిస్తున్న 1/70 చట్టానికి సవరణలు చేయాలని ఆయన ఓ నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీనిపై గిరిజనులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ మన్యం బంద్ నకు పిలుపునిచ్చారు. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఈ వ్యాఖ్యలు చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికి అయితే స్పీకర్లుగా వ్యవహరిస్తున్న వారు వివాదాల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular