Speaker Ayyanna Patrudu: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీకి ఘోర పరాజయం తప్పలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో కనీసం.. 10 శాతం అయినా వచ్చుండాలి. ఈ లెక్కన వైసీపీకి 18 స్థానాలు రావాలి. కానీ వచ్చింది 11 మాత్రమే. దీంతో వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. ఆ కారణంతోనే శాసనసభకు జగన్ హాజరు కావడం లేదు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు మాత్రమే హాజరయ్యారు. తరువాత ముఖం చాటేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని చెబుతూ సభకు వాకౌట్ చేశారు. ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. చివరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బాధ్యతల స్వీకారానికి కూడా జగన్ హాజరు కాలేదు. స్పీకర్ ఎన్నికల్లో ప్రతిపక్షానిది కీలక పాత్ర. కానీ స్పీకర్ ఎన్నికకు జగన్ హాజరు కాలేదు. అంతకుముందు ఎన్నికల ఫలితాల తర్వాత.. అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకునే స్పీకర్ ఎన్నికకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన వైసిపి చచ్చిపోలేదని.. దానిని చచ్చేదాకా కొట్టాలని ఫలితాలు అనంతరం అయ్యన్నపాత్రుడు కామెంట్స్ చేశారు. చంపేయాలన్న కామెంట్స్ ను సాకుగా చూసుకొని.. అటువంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ అసెంబ్లీకి హాజరు కాలేదు జగన్.
* వైసిపి గైర్హాజరు
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికకు హాజరు కాలేదు వైసీపీ సభ్యులు. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ అదే స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు జగన్ లేఖ రాశారు. కానీ జగన్కు ప్రతిపక్ష హోదా ఛాన్స్ లేదని అయ్యన్నపాత్రుడు తేల్చేశారు. దీంతో అసెంబ్లీలో తన మైకు ఇవ్వరని… ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో.. అన్ని రకాలుగా పెడతారని ముందుగానే గుర్తించారు జగన్. అందుకే రకరకాల కారణాలు చెబుతూ శాసనసభను ఏర్పాటు చేస్తూ వచ్చారు. కనీసం సభలోకి వెళ్లేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
* జగన్ కు అయ్యన్న విన్నపం
అయితే జగన్ అసెంబ్లీకి హాజరుకావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజల కోసమైనా సభకు హాజరు కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. దీంతో ఇదే ఒక వైరల్ అంశంగా మారింది. చంపాలన్న నోటితోనే సభకు హాజరు కావాలని కోరుతున్నారని వైసీపీ శ్రేణులు ట్రోల్ చేయడం ప్రారంభించాయి. అయితే దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
* ఆ దూకుడు స్వభావంతోనే..
మరోవైపు అయ్యన్నపాత్రుడు వ్యవహార శైలి దూకుడుగా ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడు విరుచుకు పడేవారు. వ్యక్తిగత కామెంట్స్ కు సైతం వెనుకడుగు వేసే వారు కాదు. అందుకే స్పీకర్ ఎన్నిక నాడు సొంత పార్టీ సభ్యులే స్పీకర్ కు అభినందిస్తూ కొన్ని రకాల సూచనలు చేశారు. స్పీకర్ పదవి దృష్ట్యా కొన్ని వ్యాఖ్యలు తగ్గించుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, స్పీకర్ ఎన్నికకు ముందు అయ్యన్నపాత్రుడు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సభాపతి హోదాలో ఇస్తున్న పిలుపు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆ వ్యాఖ్యలను స్వీకరించేందుకు వైసిపి సిద్ధంగా లేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More