AP BJP: ఆ బిజెపి నేతల జాడేది?

జివిఎల్ నరసింహం కు అధిష్టానం వద్ద ఎంతో పరపతి ఉండేది. ఆ పరపతి తోనే ఆయన ఉత్తర ప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈయన సైతం చంద్రబాబు ప్రయత్నాలను అడ్డుకున్నారు.

Written By: Dharma, Updated On : April 13, 2024 2:52 pm

AP BJP

Follow us on

AP BJP: రెండేళ్ల కిందట ఏపీ బీజేపీ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహం, విష్ణు కుమార్ రెడ్డి లాంటి నేతలు. ఈ నేతలంతా ఒక వెలుగు వెలిగారు. జీవీఎల్ అయితే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. సోము వీర్రాజు గురించి చెప్పనవసరం లేదు. గత ఎన్నికల అనంతరం బిజెపి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అటు తరువాత ఆ బాధ్యతలను తీసుకున్నారు సోము వీర్రాజు. గత ఐదు సంవత్సరాలుగా బిజెపితో కలవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు కనిపించకుండా పోవడం చర్చగా మారింది.

జివిఎల్ నరసింహం కు అధిష్టానం వద్ద ఎంతో పరపతి ఉండేది. ఆ పరపతి తోనే ఆయన ఉత్తర ప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈయన సైతం చంద్రబాబు ప్రయత్నాలను అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తు యత్నాలను వ్యతిరేకించారు. ప్రో వైసిపి నేతగా ముద్రపడ్డారు. ఎన్నికల్లో విశాఖపట్నం పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈయనకు కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఈయన జాడ కూడా ఇప్పుడు కనిపించకుండా పోయింది.

మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన సైతం ప్రోవైసిపీ నేతగా ముద్రపడ్డారు. దీంతో ఆయన అభ్యర్థిత్వం ఈసారి కనిపించలేదు. అప్పట్లో టిడిపి తో పొత్తును బాహటంగా వ్యతిరేకించిన నేతలు ఈయన కూడా ఒకరు. ఎల్లో మీడియా డిబేట్ కు హాజరై.. అమరావతి ఉద్యమ నేతతో దెబ్బలు కూడా తిన్నారు. అయితే ఈ ముగ్గురే కాదు చల్లపల్లి నరసింహారెడ్డి, శాంతా రెడ్డి తదితర నేతలకు అసలు టిక్కెట్లు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం వలసనేతలైన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు, సత్య కుమార్, రోసన్న, కొత్తపల్లి గీత, పురందేశ్వరి లాంటి చంద్రబాబు శ్రేయోభిలాషులకు టికెట్లు దక్కాయి. దశాబ్దాలుగా బిజెపిలోనే ఉంటూ స్వతంత్రంగా ఎదగాలన్న వారికి రిక్త హస్తమే ఎదురైంది.

ఏపీ బీజేపీలో చోటు చేసుకున్నపరిణామాలు దశాబ్దాలుగా ఆ పార్టీలో కొనసాగుతున్న వారికి మింగుడు పడటం లేదు. వారిలో వారే మనస్థాపానికి గురవుతున్నారు. అలాగని పక్క పార్టీల్లోకి వెళ్ళలేక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. తాము కాపాడుకునే పార్టీలోకి.. వలస పక్షుల్లా వచ్చి టిక్కెట్లు దక్కించుకోవడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరెవరు బిజెపిలోకి చొరబడి ప్రయోజనాలు పొందుతుంటే.. నిస్సహాయ స్థితిలో ఉండి పోవాల్సిన పరిస్థితి వారిది. వారు చేసిన తప్పు చంద్రబాబును వ్యతిరేకించడం, టిడిపి తో పొత్తు వద్దనుకోవడం. అందుకే ఆ రెండు అంశాలకు దోహదపడి, కృషి చేసిన వారికి మాత్రమే ఈసారి టిక్కెట్లు దక్కాయి. తమకు జరిగిన అన్యాయాన్ని అధిష్టానానికి విన్నవించిన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. అందుకే ఆ సీనియర్లు అంతా సైలెంట్ అయ్యారు. పార్టీకి దూరంగా జరిగిపోయారు.