TDP MLAs : ఏపీ అసెంబ్లీలో విపక్షం లేదు. కేవలం అధికార పక్షం మాత్రమే ఉంది. 11 అసెంబ్లీ సీట్లు వచ్చిన వైసిపికి ప్రతిపక్ష హోదా లభించలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రామని వైసీపీ చెబుతోంది. దీంతో ప్రతిపక్షం లేని అసెంబ్లీ కావడంతో పెద్ద మజా లేదు. వాగ్వాదాలు లేవు. ప్రశ్నలు, నిలదీతలు లేకపోవడంతో చప్పగా సాగుతోంది. అయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కొందరు కూటమి ఎమ్మెల్యేలు. మంత్రులకు ప్రశ్నలు వేయడంతో పాటు నిలదీసినంత పని చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు గళం ఎత్తుతున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన సీనియార్టీని సభలో పదేపదే చెప్పుకున్నారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఎక్కువగా ఇవ్వాలని కోరారు. అయితే స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణం రాజు ఒకానొక దశలో అసహనం కూడా వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానంపై సునిశితమైన విమర్శలు చేశారు. ప్రతిపక్ష సభ్యుడికి మించి మాట్లాడారు. తరువాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సైతం అదే స్థాయిలో మాట్లాడారు. జీరో అవర్ అన్నది డ్రైవర్ లేని బండి గా అభివర్ణించారు. సభ్యులు మాట్లాడిన మాటలు, లేబనెత్తిన ప్రశ్నలు మంత్రులు నోట్ చేసుకునే విధానం గతంలో ఉండేదని.. ఇప్పుడు మాత్రం అటువంటిది కనిపించడం లేదని ఆక్షేపించారు. దీనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెనాయుడు స్పందించారు. శాఖల వారీగా నోట్ చేసుకుంటున్నట్లు తెలిపారు.
*మంత్రి పదవి ఆశించిన వారే
అయితే దాదాపు సభలో మాట్లాడిన టిడిపి సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశించిన వారే. సాధారణంగా వారికి మంత్రులపై కోపం ఉంటుంది కూడా. దాదాపు పది మంది వరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. తమకు రాని అవకాశాలు వారు దక్కించుకున్నారన్న ఆక్రోషం ఉంటుంది. అందుకే తెలుగుదేశం సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. అది సభలో బయట పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. ప్రతి జిల్లాలో టిడిపిలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక ప్రచారం ఉంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే సీనియర్లు అలా మాట్లాడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* హై కమాండ్ ఆదేశాలతోనే
అయితే ఇప్పటికే ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. వైసీపీ లేని లోటు, ప్రతిపక్ష పాత్ర పోషించని ఆ పార్టీ వైనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారు. కానీ కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. వైసీపీ సభ్యులు అవమానించిన తర్వాత మాత్రమే సభను బహిష్కరించారు. కానీ జగన్ మాత్రం ఆది నుంచి సభను బహిష్కరించడం మాత్రం విమర్శలకు కారణమవుతోంది. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే.. వారు హోదా కోసం తపన పడుతున్నారు. అందుకే టిడిపి సీనియర్లు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Some tdp mlas are wronging government policies while mentioning public issues in the assembly
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com