Social Media : సోషల్ మీడియా..ఓ ప్రసార మాధ్యమం. తొలిరోజుల్లో స్నేహం, పరిచయాల కోసం ఉపయోగపడిన సాధనం. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్..ఇలా అన్నింటినీ ప్రజలు తమ భావోద్వేగాలను, సమాచారాన్ని పంచుకోవడానికి వినియోగించారు. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే సోషల్ మీడియాలో కూడా రెండు పార్శ్యాలు ఉన్నాయి. కానీ మంచి కంటే చెడు అతి చేసింది. హైలెట్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలోకి రాజకీయం ఎంటరయ్యాక మరింత జుగుప్సాకరంగా మారింది. సోషల్ మీడియా ఎంటరైన తొలిరోజుల్లో చాలామంది ప్రముఖులు బయట ప్రపంచానికి వెలుగుచూశారు. అలా వచ్చిన వారే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో మోదీ సమ్మోహన శక్తిగా మారడం వెనుక సోషల్ మీడియా పాత్ర ఉంది.
సోషల్ మీడియాకు వ్యూహకర్తలు తోడయ్యారు. వారి వ్యూహాల అమలుకు సోషల్ మీడియాను సాధనంగా చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను పలుచన చేసుకోవడం, తమ విధానాలను విస్తృతం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇందుకుగానే ఏకంగా ఒక వింగ్ నే రూపొందించుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను వినియోగించుకుంది. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగింది. దీనికి ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే వ్యూహాలు తోడయ్యాయి. ఏపీ సమాజాన్ని కుల, మత, వర్గాలుగా విడగొట్టడంలో సోషల్ మీడియా ఎనలేని పాత్ర పోషించింది. ఫేక్ అకౌంట్లతో టీడీపీపై విష ప్రచారానికి దిగింది. అప్పట్లో అది బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను మరింత బలోపేతం చేసుకుంది. మొన్నటికి మొన్న లోకేష్ యువగళం పాదయాత్ర కోసం వైసీపీ సోషల్ మీడియా 1000 మంది యాక్టివిస్టులను నియమించుకుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఎక్కడో విదేశాల నుంచి సోషల్ మీడియాను ఆపరేట్ చేసి రాజకీయ ప్రత్యర్థులను పలుచన చేసుకోవడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. ఇందుకుగాను పేర్లు, చివరకు కులాన్ని సైతం మార్చి.. మార్ఫింగ్ చేసుకోవడం అత్యంత జుగుప్సాకరం. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నచ్చని వారిపై దుష్ఫ్రచారం చేయడం రివాజుగా మారింది. లండన్ నుంచి సునీతా రెడ్డి అనే యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంలో ముందుంటారు. పెద్దస్థాయి విమర్శలు, పోస్టింగులకు సైతం వెనుకడుగు వేయరు. అటువంటి సునీతా రెడ్డి గురించి ఆరాతీసే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఆసక్తికరరమైన అంశాలను బయటపెట్టింది. ఆమె సునీతారెడ్డి కాదని.. సునీతా చౌదరి అని తేల్చేశారు. ఆమె తెర వెనుక టీడీపీ ఉందని బయటకుతీశారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చారు. ఆమె భావస్వేచ్ఛ హక్కును వైసీపీ కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఎన్నికల ముందు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాను రాజకీయ వేదికగా వాడుకుందన్న మాట.