Simhachalam Incident : ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 9న తిరుపతిలో( Tirupati) జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. అయితే ఈ రెండు ఘటనలు కూటమి ప్రభుత్వం పనితీరుపై పడ్డాయి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీ లో తొక్కిసలాట జరిగింది. సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనానికి క్యూలైన్లో ఉన్న భక్తులపై గోడ పడింది. అయితే ఇలా రెండు ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీమూలంగా ఘటనలు జరిగాయి. తాజాగా భారీ వర్షం పడిన నేపథ్యంలో ఈదురుగాలులకు గోడ కూలిపోయింది. అయితే కారణాలు ఏవైనా ప్రభుత్వానికి ఇవి మాయని మచ్చగా నిలుస్తాయి.
Also Read : అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి!
* తిరుమల చరిత్రలోనే విషాదం.. తిరుమల( Tirumala) చరిత్రలోనే ఎన్నడు అంతటి విషాదం జరగలేదు. ఏటా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తుంటారు. భారీగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం దీనిపై అప్పట్లో ప్రచారం బాగా చేసింది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో ఆన్లైన్ టికెట్ విక్రయాలు జరగగా.. సామాన్య భక్తులకు సైతం స్వామివారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆఫ్లైన్ టికెట్ జారీని అప్పట్లో చేపట్టారు. ఈ క్రమంలోనే టిక్కెట్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్ లో ఉండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరి ఆడక ఓ ఆరుగురు భక్తులు చనిపోయారు. అయితే ఓ పోలీస్ అధికారి తీరుతోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. టిక్కెట్ల జారీ ప్రక్రియను పర్యవేక్షించిన అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. విచారణలతో పాటు సమీక్షలు కొనసాగాయి. ఉన్నత స్థాయి దర్యాప్తునకు సైతం ఆదేశించింది.
* కఠిన ఆంక్షలు అవసరం
అయితే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పర్వదినాల నాడు కొన్ని రకాల ఆంక్షలు విధించడం ఉత్తమం. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అపశృతులు( incidents ) చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలా మూల్యం చెల్లిస్తున్న ప్రభుత్వంతో పాటు ఆలయాల పాలకవర్గాలు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. అయితే సింహగిరిలో జరిగిన ఘటనకు సంబంధించి భారీ వర్షం ఒక కారణం. భక్తుల రద్దీ నేపథ్యంలో.. భారీ ఈదురు గాలులు వీయడంతో ఆ గోడ కూలిపోయింది. దీనికి ప్రభుత్వానికో.. యంత్రాంగానికో తప్పు పట్టలేము కానీ.. ఇటువంటి భారీ కార్యక్రమాల నిర్వహణ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
* రాజకీయ విమర్శలకు దోహదం..
అయితే టీడీపీ కూటమి( TDP Alliance government ) ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడానికి ఈ ఘటనలు కారణమవుతున్నాయి. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలోనే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో అపశృతి జరిగింది. తొక్కిసలాటలో భారీగా భక్తులు చనిపోయారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి ఘటన జరిగింది. అది మరువక ముందే ఇప్పుడు సింహాచలంలో అదే స్థాయిలో ఘటన చోటుచేసుకుంది. ఇది రాజకీయంగా టిడిపి కూటమికి ఇబ్బందికరమే. అందుకే పుణ్యక్షేత్రాలు, ప్రముఖ దేవస్థానాల్లో జరిగే కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.