Simhachalam : విశాఖపట్నం( Visakhapatnam) సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షం కారణంగా సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం సహాయ చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భారీ వర్షం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయ చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.
Also Read : నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. కారణం అదే!
* భారీ వర్షంతో కూలిన గోడ..
స్వామి వారి నిజరూప దర్శనానికి ఉత్తరాంధ్రతో( North Andhra ) పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో భారీగా బారులు తీరారు. సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర.. 300 రూపాయల టిక్కెట్ క్యూ లైన్ వద్ద మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ తరుణంలో అక్కడ ఉన్న గోడ కూలిపోయింది. ఆ శిధిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. వెంటనే ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు మొదలుపెట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విశాఖలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే అప్రమత్తమయ్యారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
* హోంమంత్రి పరిశీలన..
ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత( home minister vagalapudi Anita ), జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిటీ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చీ సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కాగా నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.’ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలిసి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడ పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారిని చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను ‘ అని అన్నారు.
* భారీగా తరలివచ్చిన భక్తులు..
కాగా వరాహ లక్ష్మీనరసింహస్వామి( Lord Varaha Lakshmi Narasimha Swamy ) నిజరూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా సింహగిరికి తరలివచ్చారు. తెల్లవారుజామున ఒంటిగంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. ఆ తర్వాత స్వామివారి దేహం పై ఉన్న చందనాన్ని వెండి బొరిగిలతో తీసేశారు. నిజరూపంలో వచ్చిన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. తొలి చందనాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ తరఫున రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు.