Kurmannapalem RTC depot: విశాఖపట్నంలో( Visakhapatnam) ఓ ఆర్టీసీ డిపో మూత అంచున ఉంది. దీనిపై ఆర్టీసీ సిబ్బంది వందలాదిమంది ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. స్టీల్ సిటీలో ఆర్టీసీకి ఒక డిపో ఉంది. అయితే ఇది స్టీల్ ప్లాంట్ భూముల్లో ఏర్పాటు చేశారు. లీజు ప్రాతిపదికన నడుస్తోంది. ఈ లీజు ఆగస్టు 2024 తోనే ముగిసింది. అయితే కొత్త లీజు కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భారీగా డబ్బులు డిమాండ్ చేస్తోంది. అంత డబ్బు చెల్లించే పరిస్థితుల్లో లేదు ఏపీఎస్ఆర్టీసీ. అలాగని ప్రత్యామ్నాయంగా డిపో ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మూడు దశాబ్దాలుగా సేవలందిస్తూ వస్తున్న స్టీల్ సిటీ ఆర్టీసీ డిపో మూత దిశగా అడుగులు వేస్తోంది. వందలాదిమంది ఉద్యోగులు, కార్మికులు దీనిపై ఆందోళనతో ఉన్నారు.
గత ఏడాదిలోనే ముగిసిన లీజు గడువు
విశాఖ శివారు ప్రాంతం కూర్మన్నపాలెంలో( kurmannapalem) సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ డిపో. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన స్థలం. 1991లో ఆర్టీసీ ఈ స్థలాన్ని 33 ఏళ్లకు తీసుకుంది. డిపో అవసరాలకు తగ్గట్టుగా దీన్ని నిర్మించారు. 1992లో ఈ డిపో అందుబాటులోకి వచ్చింది. అయితే గత ఏడాది ఆగస్టు తోనే లీజు గడువు ముగిసింది. లీజును రెన్యువల్ చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆర్టీసీకి నోటీసులు పంపింది. 133 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని.. ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని.. లేకుంటే మాత్రం స్థలాన్ని ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. స్టీల్ ప్లాంట్ డిమాండ్లను చూసి ఆర్టీసీ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కొత్త డిపో ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా.. అగనంపూడి సమీపంలో దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు ప్రయత్నించారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం కొత్త డిపో ఏర్పాటుకు ముందుకు రాలేదు.
కొత్త డిపో ఏర్పాటు కష్టం..
కొత్త స్థలంలో డిపో ఏర్పాటుకు దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే అంత మొత్తం చెల్లించే స్థితిలో ఆర్టీసీ యాజమాన్యం లేదు. అందుకే ఇక్కడ డిపో మూత దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. కార్మిక సంఘాల నాయకులు డిపో పరిస్థితిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్లీజ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. అయితే నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ క్రమంలో టిడిపి కూటమి ప్రజాప్రతినిధులు దీనిపై స్పందిస్తున్నారు. జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఈ డిపో పరిస్థితిని అజెండాలో చేర్చారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ డిపో మూతపడటం జరగకూడదని ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవేళ ఈ డిపో మూతపడితే మాత్రం ఇక్కడ బస్సులను ఇతర డిపోలకు సర్దుబాటు చేస్తారు. 350 మంది సిబ్బందిని వేరువేరు డిపోలకు పంపనున్నారు. అయితే 100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. వీరంతా కూటమి ప్రభుత్వం పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?