YS Sharmila: షర్మిల టార్గెట్ మారుతోందా? హై కమాండ్ ఆదేశాలు ఇచ్చిందా? ఇందులో భాగంగానే ఏపీలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా? చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలపై మాట్లాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఇప్పటివరకు జగన్ పైనే ఫోకస్ పెట్టారు షర్మిల. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే.. జగన్ పతనాన్ని ఎక్కువ కోరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. జగన్ ఓటమికి షర్మిల ప్రధాన కారణం అయ్యారు. జగన్ ఓటమి తరువాత కూడా ఆయన్నే టార్గెట్ చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారపక్షంగా ఉన్నా విమర్శలు చేయడం లేదు. అయితే తాజాగా చంద్రబాబు సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఏకంగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు. ఘాటైన పదాలతో విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ నుంచి వచ్చిన సంకేతాలు మేరకే షర్మిల స్వరంలో మార్పు వచ్చిందన్న టాక్ నడుస్తోంది.
* టిడిపి పై విమర్శలు అంతంత మాత్రమే
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే కూటమి జాతీయస్థాయిలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. కానీ ఏపీ సర్కార్ తో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. సిద్ధాంతపరంగా టిడిపి కూటమి తమకు వ్యతిరేకమని తెలిసినా పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఆమె నోరు తెరిస్తే జగన్ ను టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది.
* అప్పుడు కూడా జగనే టార్గెట్
ఇటీవల విజయవాడకు వరదలు వచ్చాయి. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. చాలామంది చనిపోయారు. ప్రభుత్వపరంగా సహాయ చర్యలు ముమ్మరంగా సాగాయి. వరద నియంత్రణ చర్యల్లో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. అయితే ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ వైఫల్యం అని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వరద నియంత్రణతో పాటు బాధితులకు సహాయం అందించడంలో సైతం ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. అయితే దీనిపై స్పందించిన షర్మిల జగన్ వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు సర్కార్ బాగానే పనిచేస్తుందన్న రీతిలో మాట్లాడారు. విజయవాడ వరదలకు జగన్ కారణమని ఆరోపించారు. తద్వారా చంద్రబాబును మరోసారి వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.
* ఎన్డీఏ నుంచి తప్పుకోవాలని డిమాండ్
అయితే తాజాగా చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడ్డారు షర్మిల. ఏపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులను రాబెట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. అటువంటప్పుడు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. తక్షణం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. అయితే జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులు.. కర్ణాటకలో జగన్ ప్యాలెస్ లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశాలు.. తదితర కారణాలతోనే షర్మిల స్వరం మారినట్లు తెలుస్తోంది. మున్ముందు ఆమె చంద్రబాబు సర్కారును టార్గెట్ చేస్తే మాత్రం ఏపీ రాజకీయాలు యూటర్న్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Sharmila uturn target fixed high command
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com