IAS Officer Sharath: తిరుమల తిరుపతి దేవస్థానంలో( Tirumala Tirupati Devasthanam) కీలక నియామకాన్ని చేపట్టింది ఏపీ ప్రభుత్వం. టీటీడీ జేఈఓ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విద్యా ఆరోగ్య విభాగాల జేఈవో పదవిలో శరత్ ను నియమించారు. ఈ పోస్ట్ గత ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. శరత్ తెలంగాణ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. వీటిని పరిగణలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. కొద్ది నెలల కిందటే ఆయన ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు.
* రేవంత్ కాళ్లు మొక్కిన అధికారిగా..
అయితే ఐఏఎస్ అధికారి శరత్( IAS officer Sarath ) విషయంలో గతంలో ఓ వార్త వైరల్ అయింది. ఆయన తెలంగాణ క్యాడర్లో ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లిన సమయంలో.. ఆయన కాళ్లు మొక్కడం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అక్కడ కొద్ది నెలలకు శరత్ పదవీ విరమణ చేశారు. అయితే వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతలోనే టీటీడీ జేఈఓ గా ఆయనకు పోస్టింగ్ రావడం ఆసక్తికరంగా మారింది.
* చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు..
ఏపీ సీఎం చంద్రబాబుతో( AP CM Chandrababu) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శరత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన పనితీరుతో పాటు వ్యవహార శైలిపై చంద్రబాబుకు అవగాహన ఉండడంతోనే టీటీడీ నియామకం జరిగినట్లు సమాచారం. శరత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సాధారణ పరిపాలన శాఖ శరత్ నియామకానికి సంబంధించి ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శరత్ గ్రూప్ 1 అధికారిగా ఉన్నారు. 1990 చివర్లో మదనపల్లి ఆర్డీవో గా విధులు నిర్వహించారు. తర్వాత కుప్పంలో ప్రత్యేక అధికారిగా పనిచేశారు. 2005లో ఆయనకు ఐఏఎస్ హోదా వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణ క్యాడర్ కు బదిలీ అయ్యారు. అయితే అక్కడే రిటైర్మెంట్ పొందగా.. ఇప్పుడు టీటీడీలో నియమితులు కావడం విశేషం.