Tollywood heroes 150 crore share: మన టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకు వంద కోట్ల షేర్ మార్క్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా చూసే వాళ్ళు ట్రేడ్ వర్గాలు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు వంద కోట్ల షేర్ ని కేవలం రెండు మూడు రోజుల్లో కొట్టేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఉన్నటువంటి సరికొత్త టార్గెట్ 200 కోట్ల షేర్. అదే విధంగా 150 కోట్ల షేర్ ని కూడా ప్రతిష్ఠాత్మకంగానే చూస్తున్నారు. ఈ క్లబ్ లో స్టార్ హీరోల్లో ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు తప్ప, మిగిలిన హీరోలందరూ ఉన్నారు. ప్రభాస్ ఈ లిస్ట్ లో టాప్ అని చెప్పొచ్చు. కేవలం తెలుగు వెర్షన్ నుండి ప్రభాస్ కి నాలుగు 150 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటంటే బాహుబలి సిరీస్(1,2), సలార్, కల్కి 2898AD. ఇక ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు 150 కోట్ల షేర్ సినిమాలతో టాప్ 2 లో ఉన్నాడు.
అందులో ఒకటి ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం. 2020 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించి దాదాపుగా 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి. ఇక ఆయన నుండి వచ్చిన మరో చిత్రం ‘పుష్ప 2’ తెలుగు వెర్షన్ నుండి దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు సినిమాలతో అల్లు అర్జున్ తో సరిసమానంగా రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు. ఆయన నటించిన #RRR చిత్రం తెలుగు వెర్షన్ నుండి 270 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టగా, దేవర చిత్రం 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కూడా #RRR చిత్రమే 150 కోట్లకు పైగా షేర్ రాబట్టిన సినిమా, ప్రస్తుతానికి ఆయన ఖాతాలో రెండవ 150 కోట్ల సినిమా లేదు.
ఇక స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం తో ఏకంగా 190 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు. ఈ చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్ కి వంద కోట్ల షేర్ సినిమా లేదని సోషల్ మీడియా లో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసేవాళ్ళు. కానీ ‘ఓజీ’తో ఆయన ఏకంగా 190 కోట్ల షేర్ ని రాబట్టి తన స్టామినా ఎలాంటిదో మరోసారి నిరూపించుకున్నాడు. ‘కాంతారా 2’ చిత్రం పోటీ లో లేకుంటే 200 కోట్ల షేర్ ని కూడా ఈ సినిమా అందుకొని ఉండేది. ఇక గత ఏడాది సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో 150 కోట్ల షేర్ ని అందుకోగా, రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో 150 కోట్ల మార్కుని అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది కాబట్టి, ఫుల్ రన్ లో 200 కోట్ల షేర్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.