Chandrababu: ప్రస్తుతం తెలుగు నాట ఎన్నో మీడియా ఛానళ్లు ఉన్నాయి. కానీ 90వ దశకంలో ఉన్నవి అరకొరే. ఆ సమయంలో దూరదర్శన్ కు ఎనలేని క్రేజ్. ప్రతి శుక్రవారం వచ్చే చిత్రలహరి, ఆదివారం వచ్చే మహాభారతం ధారావాహికం. పిల్లలను ఆకట్టుకునే జంగిల్ బుక్ సీరియల్. ఇలా అన్ని ప్రత్యేకమే. కానీ అన్నింటికీ మించి రాత్రి 7 గంటలకు వచ్చే దూరదర్శన్ న్యూస్ అంటే ఎనలేని క్రేజ్. దానికి కారణం న్యూస్ ప్రజెంటేటర్ శాంతి స్వరూప్. న్యూస్ చదవడంలో తెలుగునాట కొత్త వన్నె తెచ్చింది ఆయనే. ఆయన కేవలం న్యూస్ రీడర్ కాదు. సమయస్ఫూర్తిగా వ్యవహరించగలిగిన మంచి జర్నలిస్టు కూడా. ఈ విషయాన్ని మాజీ సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పడం విశేషం.
తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. 1983 నుంచి 2011 వరకు ఆయన దూరదర్శన్ న్యూస్ రీడర్ గా పనిచేశారు. న్యూస్ చదవడంలో సరికొత్త ట్రెండును తీసుకొచ్చారు. ఒక న్యూస్ రీడర్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది అంటే ఆయన డెడికేషన్ ఎలా ఉండేదో తెలుస్తోంది. న్యూస్ రీడింగ్ అంటే వార్తలు చదవడం.. చెప్పడమని వర్ధమాన న్యూస్ రీడర్లకుచాలా సందర్భాల్లో సలహాలు ఇచ్చారు. అయితే మీడియా పాత్ర అంతంతమాత్రంగా ఉండే సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో ముఖాముఖి నిర్వహించిన ఘనత శాంతి స్వరూప్ సొంతం.
ఈరోజు శాంతి స్వరూప్ మృతి చెందడంతో మాజీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దూరదర్శన్ లో చంద్రబాబు ‘ ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహించేవారు. నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. చంద్రబాబు పాలనా దక్షుడిగా పేరు తెచ్చుకునేందుకు దోహద పడింది. ఇప్పుడు అదే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. శాంతి స్వరూప్ తో అనుబంధం సుదీర్ఘమైనదని.. ఆయన మృతి కలచివేసిందని.. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. అయితే ఒక్క చంద్రబాబుతో కాదు. చాలామంది ప్రముఖులు సైతం శాంతిస్వరూప్ తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడానికి ఆసక్తి చూపేవారు. అసలు మీడియా అంటేనే దూరదర్శన్ అనే పరిస్థితి ఉండే సమయంలో సైతం.. శాంతి స్వరూప్ అదే దూరదర్శన్ ను తన శక్తి యుక్తులతో, వీక్షక ఆదరణలో ముందంజలో ఉంచేవారని దూరదర్శన్ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి.