Minister Lokesh : మరోసారి విజయసాయిరెడ్డి వ్యక్తిగత వ్యవహారం బయటకు వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వైసిపి హయాంలో తనను మోసపూరితంగా అమెరికా పంపించి.. విజయసాయిరెడ్డి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె భర్త మదన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన శాంతి తన మాజీ భర్త ఆరోపణలు నిజం కాదని ఖండించారు. అయినా సరే మదన్ నుంచి ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మదన్ హైదరాబాదులో పని చేసేవారు. విజయసాయిరెడ్డి పనిగట్టుకుని తనను కలకత్తా బదిలీ చేశారని చెబుతున్నారు మదన్. తాజాగా మంత్రి నారా లోకేష్ ను కలిసిన మదన్.. తన సమస్యలను విన్నవించుకున్నారు. లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించిన నేపథ్యంలో ఆయనను కలిశారు. మరోసారి సంచలన విషయాలను బయటపెట్టారు.
* రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టి
అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి విశాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే తన భార్యను లోబరుచుకుని విజయసాయిరెడ్డి విశాఖలో 1500 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారని.. ఆయన అక్రమాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్కతాకు బదిలీ చేయించారని మదన్ లోకేష్ కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి తో పాటు అడ్వకేట్ సుభాష్ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో మదన్ ఆరోపణలు సంచలనంగా మారాయి.
* సంచలన విషయాలు
మరోసారి విజయసాయిరెడ్డి సహజీవనం గురించి కూడా ప్రస్తావించారు మదన్. తనను ఏ మార్చి అమెరికా పంపిన విజయసాయి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగ బిడ్డను కన్నారన్నారు. ఆ బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. న్యాయం చేయాలని రాష్ట్రపతి తో పాటు ప్రధాని కార్యాలయాలకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయినా సరే ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదన్నారు. విజయసాయి రెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ కమిషనర్ గా పనిచేసిన శాంతి 20 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు సంపాదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయసాయి కుట్రతో కోల్కత్తాకు తనను బదిలీ చేశారని గుర్తు చేశారు. అయితే దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో మరోసారి మదన్ ఆరోపణలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి