AP Cabinet : మెగా బ్రదర్ నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు ఇచ్చే శాఖలపై కూడా క్లారిటీ వస్తోంది. నిన్న సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో నాగబాబు కు మంత్రి పదవి, ప్రమాణ స్వీకారం వంటి వాటికోసం చర్చించారు. ఎమ్మెల్సీ పదవుల భర్తీపై కూడా దృష్టి పెట్టారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నాగబాబు తో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. ఈ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. 164 సీట్లలో గెలుపొందింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసిపి 11 స్థానాలకు పరిమితం అయింది. మూడు పార్టీలకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మూడు పార్టీలకు చెందిన 24 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరింది. ఇంకా ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది. ఆ స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేయడానికి డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఒక్క నాగబాబు మాత్రమే కాదు ఒకరిద్దరు అదనంగా ప్రమాణస్వీకారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
* పల్లా శ్రీనివాసరావుకు అవకాశం?
రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి దక్కింది. 20 మంది టిడిపి ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఉండేలా చూసుకున్నారు. ఈ లెక్కన జనసేనకు మూడు లభించాయి. 8 అసెంబ్లీ స్థానాలు గెలుపుతో బిజెపికి ఒక మంత్రి పదవి దక్కింది. తాజాగా రాజ్యసభ పదవుల సమీకరణల్లో నాగబాబు కు ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే ఆయనను రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే నాగబాబు తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తాజాగా ఒక వార్త హల్చల్ చేస్తోంది.
* అనూహ్యంగా ఎంపిక
ఈ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి గెలిచారు పల్లా శ్రీనివాసరావు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నేత కూడా ఆయనే. దాదాపు 90 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు శ్రీనివాసరావు. బీసీ వర్గానికి చెందిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ అనూహ్యంగా టిడిపి రాష్ట్ర పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు బాబు. ఇప్పుడు సభ్యత్వ నమోదు లో కూడా రికార్డ్ సృష్టించారు. దీంతో చంద్రబాబు పల్లా శ్రీనివాసరావును క్యాబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రుల వ్యవహార శైలిపై అభ్యంతరాలు ఉన్నాయి. వారు పనితీరు కూడా మెరుగుపరుచుకోవడం లేదు. ఈ తరుణంలోనే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే పల్లా శ్రీనివాసరావు విషయంలో లోకేష్ సైతం పట్టుదలతో ఉన్నారు. పైగా విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. అందుకే పల్లా శ్రీనివాసరావు మంత్రి కావడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.