MLA Kolikapudi Srinivasa Rao : తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్టైల్ వేరు. మొన్న ఆ మధ్యన వార్తల్లో బాగా నిలిచారు. సొంత పార్టీ శ్రేణులే ఆయనపై హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు. మందలించారు. అయినా సరే ఆయనపై విమర్శలు రావడంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సి వచ్చింది. పార్టీ నేతలు సర్దుబాటు చేయడంతో వివాదం కొలిక్కి వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఆయన ఏపీ ప్రభుత్వ మద్యం పాలసీలో ఉన్న లోపాలను బయటపెట్టే పనిలో పడ్డారు. తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బెల్టు షాపులు నడుపుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం పార్టీలను బయటకు తెచ్చి బెల్ట్ షాపులో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 48 గంటల్లోపు బెల్ట్ షాపులు తొలగించకపోతే.. తిరువూరు నియోజకవర్గంలో మద్యం అన్నదే లేకుండా చేస్తానని శపధం చేశారు. ప్రస్తుతం కొలికపూడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* భారీగా పెరిగిన విక్రయాలు
నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 3300 షాపులు ఏర్పాటయ్యాయి. మద్యం ధరలను తగ్గించడంతో పాటు అన్ని ప్రీమియం బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. మందుబాబులు కోరిన బ్రాండ్లు దొరుకుతున్నాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 మధ్య రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగాయి. ఏకంగా 4677 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే మద్యం షాపులతో పాటు భారీగా బెల్టు దుకాణాలు వెలసినట్లు అర్థమవుతోంది.
* బెల్టు దుకాణాలపై సమరం
అయితే రాష్ట్రవ్యాప్తంగా బెల్టు దుకాణాల ఏర్పాటు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా తిరువూరు ఎమ్మెల్యే ఒక్కసారిగా తిరుగుబాటు చేయడం విశేషం. బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కొలికపూడి ఆందోళనకు దిగారు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న నాలుగు మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం 48 గంటల పాటు గడువు ఇచ్చారు. ఈలోగా బెల్టు షాపులను తొలగించకపోతే తిరువూరులో మద్యం అనేది లేకుండా చేసే బాధ్యత తనదేనని తేల్చి చెప్పారు. తిరువూరు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్యం షాపులు ఉన్నాయని.. తనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయా దుకాణాల యజమానులు 35 నుంచి 40 బెల్ట్ షాపులు దీనికి అదనంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికైతే చంద్రబాబు మద్యం పాలసీ పైనే కొలికపూడి సమరం ప్రకటించడం విశేషం.