https://oktelugu.com/

Tirumala Laddu Controversy :  సుప్రీం కోర్టు ఆదేశాల వేళ… తిరుమలలో సిట్ సంచలనం

గత కొద్దిరోజులుగా తిరుమల లడ్డు వివాదం సీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తోంది. అయితే నిన్న సుప్రీంకోర్టు స్పందనతో కొత్త మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తుపై కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో అత్యున్నత దర్యాప్తు బృందం తిరుమలలో కీలక పరిశీలన చేస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 1, 2024 / 10:24 AM IST

    Tirumala Laddu Controversy

    Follow us on

    Tirumala Laddu Controversy :  తిరుపతి లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పందించింది.రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం విషయంలో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు సరిపోతుందా? లేదా? అని సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించింది. నివేదికలు ఇవ్వాలని సూచించింది. ఈనెల 3న మరోసారి విచారణ చేపట్టనుండి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సొలిసిటర్ జనరల్ నివేదిక ఇప్పుడు కీలకంగా మారనుంది. ఒకవేళ అత్యున్నత దర్యాప్తు కావాలంటే.. సిబిఐ ను రంగంలో దించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏర్పాటైన సిట్ బృందం విస్తృత తనిఖీలు చేపడుతోంది. ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డు తయారీకి సంబంధించి వాడిన నెయ్యిలో.. జంతు కొవ్వు కలిసిందన్నది చంద్రబాబు చేసిన ఆరోపణ. గుజరాత్ లోని ఓ ల్యాబ్ నిర్ధారించిందని చెప్పుకొచ్చారు. అయితే సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. కోట్లాదిమంది మనోభావాలతో ఉద్దేశించిన అంశం కావడంతో ఆధారాలు, నిర్ధారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. కొన్ని రకాల ప్రశ్నలను లేవనెత్తింది. తదుపరి విచారణలో దీనిపై చర్చిస్తామని చెప్పుకొచ్చింది. దీంతో అందరి దృష్టి ఈనెల 3న జరగనున్న విచారణపై ఉంది.

    * సిట్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
    అయితే మరోవైపు సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వ శ్రేష్ట త్రిపాటి అధ్యక్షతన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో డిఐజి గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, డిప్యూటీ ఎస్పీలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ సూర్యనారాయణలతో కూడిన టీం ఏర్పాటు అయింది. ఇప్పటికే విచారణను ప్రారంభించింది.

    * ఆ ఫిర్యాదు మేరకు
    ఇటీవల ఓ డెయిరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని దిండిగల్ లో గల ఏఆర్ డైరీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. దానిపై దృష్టి పెట్టింది సిట్ బృందం. విచారణలో భాగంగా తిరుమల లోని టీటీడీకి చెందిన ఫ్లోర్ మిల్, లేబరేటరీ, మార్కెటింగ్ కార్యాలయం, శ్రీవారి పోటును అధికారులు తనిఖీ చేశారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యిని ఈ ఫ్లోర్ మిల్లులోనే నిల్వ ఉంచుతారు. లేబరేటరీల నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించి.. అందులో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ ఫ్లోర్ మిల్ లో స్టోర్ చేస్తారు. ఫ్లోర్ మిల్లులో అన్లోడింగ్ కోసం వచ్చిన ట్యాంకర్లు, నిల్వ ముంచిన క్యాన్ ల నుంచి నెయ్యి శాంపిళ్లను సేకరించారు. లేబరేటరీ సైతం తనిఖీ చేశారు. టీటీడీ అనుసరిస్తున్న నెయ్యి పరీక్ష విధానాన్ని తెలుసుకున్నారు. లడ్డు తయారీలో వినియోగించే ఎండుద్రాక్ష, జీడిపప్పు నాణ్యతను కూడా పరిశీలించారు.

    * ఆలయ పోటు పరిశీలన
    సాధారణంగా టీటీడీలో అన్న ప్రసాదంతో పాటు లడ్డు ప్రసాదాన్ని శ్రీవారి పోటులో తయారు చేస్తారు. అందుకే అక్కడ పోటును పరిశీలించింది సిట్ బృందం. అక్కడ ఉన్న సిబ్బందిని చాలా విషయాలను అడిగి తెలుసుకుంది. మొత్తానికైతే సుప్రీం ఆదేశాలతో పని లేకుండా.. ఎటువంటి ఆదేశాలు వస్తాయోనని ఆందోళన చెందకుండా సిట్ బృందం పక్కాగా విచారణ చేపడుతుండడం విశేషం. ఈనెల 3న జరిగే విచారణలో సిట్ దర్యాప్తుపై ప్రస్తావన వస్తే… ఒక రకమైన ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.