Kurnool Medical College : మీసాలు, గడ్డాలు తీసేయండి.. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ దారుణాలు ఇవీ!

ఇంకా ర్యాగింగ్ జాడ్యం వీడలేదు. జూనియర్లను సీనియర్లు ఆహ్వానించే సంస్కృతి పక్కదారి పట్టింది. వినోదం పేరిట ర్యాగింగ్ బయటపడుతోంది. ఈ క్రమంలో అక్కడక్కడ ఇది విష ఆచారంగా మారుతోంది. తాజాగా కర్నూలులో వెలుగు చూసింది.

Written By: Dharma, Updated On : October 22, 2024 11:09 am

Kurnool Medical College

Follow us on

Kurnool Medical College : ఏపీలో ర్యాగింగ్ భూతం ఆగడం లేదు. ర్యాగింగ్ పై ప్రభుత్వం అనేక రకాల కఠిన చర్యలకు ఉపక్రమించినా.. చాలా చోట్ల ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇటీవల కళాశాలలో చేరిన జూనియర్ విద్యార్థులపై సీనియర్లు వేధింపులకు దిగారు. రాగింగ్ పేరిట రకరకాల వికృత చర్యలకు దిగడంతో బాధితులు తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలో ఈనెల 14 నుంచి తరగతులు ప్రారంభం అయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సీనియర్లు గుంపులు గుంపులుగా హాస్టల్ భవనాల్లో చేరి ర్యాగింగ్లకు దిగుతున్నట్లు తెలుస్తోంది.జూనియర్ విద్యార్థులు బూట్లు వేసుకోకూడదు.మీసాలు,గడ్డాలు పెంచుకోవద్దు. మేం చెప్పిన యాప్ లనే డౌన్లోడ్ చేసుకోవాలని సీనియర్లు ఆదేశిస్తుండడంతో జూనియర్లు ఆందోళనకు గురవుతున్నారు. హాస్టల్లో మెస్ కు వెళ్లి తమకు భోజనం తీసుకురావాలని.. ప్లేట్లు కడగాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. కొందరు సీనియర్ విద్యార్థులు హాస్టల్లోనే సిగరెట్లు, మద్యం తాగుతున్నారని జూనియర్లు చెబుతున్నారు. సీనియర్ల వేధింపులకు గురవుతున్న బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

* యాంటీ ర్యాగింగ్ సమావేశం
ఇటీవల కాలేజీలో యాంటీ ర్యాగింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు చాలా సార్లు విద్యార్థులకు కౌన్సిలింగ్ చేశారు. అయినా సరే కాలేజీలో ర్యాగింగ్ ఆగకపోవడం విశేషం. జూనియర్ విద్యార్థులపై సీనియర్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు తాము ఇచ్చిన కళ్ళజోళ్ళు మాత్రమే వాడాలని తాజాగా కొందరు సీనియర్లు జూనియర్లకు ఆదేశించారు.ఈ విషయంపై సైతం ప్రిన్సిపాల్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సీనియర్లలో కొంతమంది దూకుడు విద్యార్థులతోనే ఈ పరిస్థితి అని తెలుస్తోంది.

* ఆ ఘటన మరువక ముందే
కర్నూలు మెడికల్ కాలేజీకి మంచి పేరు ఉంది. కానీ ఇటీవల జరిగిన చర్యలతో చరిత్ర మసకబారుతోంది. మొన్న మధ్యన ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చెలరేగిన వివాదం పెను ప్రకంపనలకు దారితీసింది. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలోనే ఈ పరిస్థితి తలెత్తడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలకు దిగాలని కోరుతున్నారు. ర్యాగింగ్ నేపథ్యంలో కాలేజీలో పటిష్ట చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.