YSRCP Leader: రాజకీయాల్లో జూనియర్లు రావాలి. సీనియర్లు సేవలందించాలి. విలువైన సలహాలతో తాము ఉన్న రాజకీయ పార్టీలకు ప్రయోజనం చేకూర్చాలి. అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) మాత్రం తన పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్లను పక్కన పెట్టేశారు. కేవలం జూనియర్లతోనే కథ నడిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నడిపించారు జగన్మోహన్ రెడ్డి. తన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసిన విజయసాయిరెడ్డిని, ఎక్కడో సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకువచ్చి పార్టీతో పాటు అనుబంధ విభాగాలను అప్పగించారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను తెచ్చి పక్కన పెట్టుకున్నారు. అయితే ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా చెల్లింది. కానీ ఎప్పుడైతే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పాలన తెలిసిందో అప్పటినుంచి వారి నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. చివరకు ఓటమి ఎదురు కావడంతో.. సీనియర్ల ప్రాధాన్యత తెలిసింది జగన్మోహన్ రెడ్డికి.
సొంత వారికి ఆ అవకాశం..
అయితే రాయలసీమ( Rayalaseema ) నుంచి మాత్రమే పార్టీలో సీనియర్లకు జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇచ్చారన్నది బహిరంగ రహస్యం. అందులోనూ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి.. తన సమీప బంధువులకు.. తాను నమ్ముకున్న, తనను నమ్ముకున్న సొంత వారికే ఆయన అండగా నిలిచారు. పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికే ప్రభుత్వం తీసుకునే అత్యంత నిర్ణయాల్లో వారికి భాగస్వామ్యం ఉండేది. ఎలాగూ జగన్ చుట్టూ విజయసాయిరెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఉండేవారు. పార్టీ అంటే వారు.. వారు అంటే పార్టీ అన్నట్టు ఉండేది. కనీసం రాజశేఖర్ రెడ్డి తో పని చేసిన సీనియర్లు ఉన్నారని గుర్తించేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. కానీ కాలం అన్నింటికీ గుణపాఠం చెబుతుంది అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే ఎదురైంది.
సీనియర్ల సేవల వినియోగం..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తన వాళ్లే ఉండేవాళ్లు. ఒకవేళ బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana) , ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు కనిపించేవారు కాదు. ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డికి ఒకే కుర్చీ ఉండేది. పక్కన సీనియర్లు ఉన్నారన్న కనీస గౌరవం ఉండేది కాదు. ప్రభుత్వ నిర్ణయాలలో వారిదే పై చేయి. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాలి అంటే వారే ఉండాలి. ప్రభుత్వంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పాలన్న వారే ఉండాలి. చివరకు వైసీపీ నేతలు ఏం మాట్లాడాలో కూడా వారే చెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్లు లేకుండా రాజకీయాలు చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు సరికొత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రమేపి ఆ కార్పొరేట్ బృందానికి చెక్ చెబుతున్నారు. త్వరలో తాడేపల్లి కార్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారట జగన్మోహన్ రెడ్డి. అదే నిజం అయితే సకల శాఖామంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటివారు సైతం అవుట్ కావాల్సిందే. సగటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని సైతం అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఓడిపోయిన కొత్తలో అందరికంటే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి పై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. అయితే అంతటి సాహస నిర్ణయానికి జగన్ నిజంగా రాగలరా? అనేది ఒక అనుమానమే.