Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ఉభయ రాష్ట్రాలను పాలించిన జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ మంచి మిత్రులుగా కొనసాగారు. ఇప్పుడు వారిద్దరికీ బద్ధ శత్రువులు అయిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఉభయ రాష్ట్రాలను పాలిస్తున్నారు. అయితే వారి మాదిరిగా రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. మొన్న మధ్యన నది జలాల మిగులును వినియోగించుకుని రాయలసీమకు ఎత్తిపోతల పథకం నిర్మించడానికి చంద్రబాబు నిర్ణయించారు. దానికి తెలంగాణ సమాజం నుంచి చాలా రకాల అభ్యంతరాలు వచ్చాయి. అప్పట్లో దీనిపై రాజకీయం చేసేందుకు గులాబీ పార్టీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అన్ని రకాలుగా చేసింది. కానీ ఏపీ నుంచి చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సమర్థించలేకపోయింది. ఎందుకంటే ఆ పార్టీకి తెలంగాణలో తన స్నేహితుడైన కేసీఆర్ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తాను రిక్వెస్ట్ చేయడం వల్లే.. చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని పక్కన పెట్టారని చెప్పారు. దానిని పట్టుకొని ఇప్పుడు కెసిఆర్ తో పాటు జగన్ రాజకీయాలు మొదలుపెట్టారు.
వృధా జలాలను రాయలసీమకు..
గోదావరి తో పాటు కృష్ణా నది మిగులు జలాలను రాయలసీమకు తరలించి బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. సముద్రంలోకి పోతున్న వృధా జలాలను ఒడిసి పట్టి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ తీసుకెళ్లాలన్నది ముఖ్య లక్ష్యం. అయితే ఈ ప్రయత్నం పై తెలంగాణ సమాజం నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న భావనలు వచ్చాయి. ఈ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్లడం.. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కావడంతో ఆచితూచి స్పందించారు కేంద్ర పెద్దలు. ఈ విషయంలో చంద్రబాబు కూడా అదే స్టాండ్ లో ఉన్నారు. కానీ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏపీ తో జలవివాదాలు ఎప్పుడు వస్తాయా? సెంటిమెంట్ ఎప్పుడు ప్రయోగిస్తామా అన్నట్టు కాచుకుని కూర్చుంది గులాబీ పార్టీ. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆలోచన చేస్తే సమర్ధించదు వైయస్సార్ కాంగ్రెస్. కానీ తెలంగాణలో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పాలకుల నోటి మాట నుంచి.. చంద్రబాబు పై వ్యతిరేక వ్యాఖ్యలు వస్తే మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రకటనతో..
తాజాగా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. తాను చంద్రబాబుతో మాట్లాడడం వల్లే రాయలసీమలో ఎత్తిపోతల పథకం నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు చెప్పుకొచ్చారు. అది మొదలు తెలంగాణలో గులాబీ పార్టీ.. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయి. అయితే తాను మాట్లాడడం వల్లే చంద్రబాబు ఆ పథకాన్ని పక్కన పెట్టారని కాంగ్రెస్ పాలకుడుగా రేవంత్ చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆ ప్రాజెక్టు తెరపైకి వచ్చిందని.. దానిని కేసీఆర్ అడ్డుకున్నారని గులాబీ పార్టీ చెబుతోంది. అయితే చంద్రబాబు బనకచర్ల అంశాన్ని లేవనెత్తినప్పుడు సమర్థించలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ మాట అనేసరికి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది ఇదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే వీరి ఉద్దేశం ఇట్టే తెలిసిపోతోంది. అయితే ప్రజలు దీనిని గమనిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల విషయంలో కానీ.. వివాదాస్పద అంశాల్లో కానీ చంద్రబాబు ఒక్క వ్యాఖ్య చేయడం లేదు. ఎందుకంటే తనను సాకుగా చూపి ఈ తరహా రాజకీయాలు చేస్తారు ఆయనకు తెలియంది కాదు. అందుకే ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.