TDP-Janasena-BJP: ఉత్తరాంధ్రలో ( North Andhra) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ కూడా పూర్తయింది. జూన్ లో విమానాశ్రయాన్ని ప్రారంభించి.. జూలై నుంచి విమాన రాకపోకలు మొదలయ్యేలా చూడనున్నారు. ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర స్వరూపమే మారనుంది. అయితే ఇప్పుడు ఏపీలోనే భోగాపురం నియోజకవర్గం ఎంతో ప్రాధాన్యత కలిగిన రాజకీయ ప్రాంతం. అందుకే అక్కడ పట్టు కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడ జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం టిడిపి తీసుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భోగాపురం లాంటి ప్రాంతంలో అధికార పార్టీ ముద్రగా చూపాలన్నది టిడిపి నుంచి వస్తున్న అభిప్రాయం. పైగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టున్న ప్రాంతం. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన ను తప్పించి.. తిరిగి టిడిపికి ఈ స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
ప్రధాన నియోజకవర్గంగా..
భోగాపురం ఎయిర్పోర్ట్ కు( bhogapuram airport) అనుబంధంగా పర్యాటక ప్రాజెక్టులు సైతం రానున్నాయి. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 500 ఎకరాల భూమిని రిజర్వు కూడా చేసింది. మొన్నటి ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కానీ రాష్ట్రస్థాయిలో కుదిరిన పొత్తుల వల్ల ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర కేంద్రంగా ఈ నియోజకవర్గం మారనుంది. అందుకే ఎంత మాత్రం ఈ నియోజకవర్గాన్ని వదిలి పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించదన్న టాక్ నడుస్తోంది. పైగా జనసేన ఎమ్మెల్యే పై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. కూటమి శ్రేణులను సమన్వయం చేసుకోలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడం.. జనసేన ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఒక రకమైన గందరగోళం ఉంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని టిడిపికి విడిచిపెట్టి.. మరో నియోజకవర్గాన్ని జనసేన ఎంచుకుంటుందన్న టాక్ కూడా నడుస్తోంది.
నెల్లిమర్ల నుంచి అదితి?..
మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు( Aditi gajapati Raju ) పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు విడిచిపెడతారని.. ఇక్కడ మాత్రం టిడిపి తీసుకుంటుందన్న టాక్ నడుస్తోంది. జనసేనకు ఇప్పటికే పాలవలస యశస్విని అనే మహిళ నేత నాయకురాలిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో ఆమె తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి వరించింది. అయితే ఈసారి తూర్పు కాపు సామాజిక వర్గానికి విజయనగరంలో ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది కూటమి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తూర్పు కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తోంది. అందుకు ధీటుగా కూటమి జనసేనకు టికెట్ ఇచ్చి.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన యశస్వినికి అవకాశం ఇస్తారని తెగ ప్రచారం జరుగుతుంది. అయితే నెల్లిమర్ల వెళ్లేందుకు అదితి గజపతిరాజు ఒప్పుకుంటారా? ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది? అనేది త్వరలో తెలుస్తుంది.