Dharmana Prasadha Rao : మాజీ మంత్రి ధర్మాన వైసీపీకి దూరమైనట్టేనా? రాజకీయాల నుంచి తప్పుకున్నట్టేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ధర్మాన ప్రసాదరావు. మంత్రిగా ఉంటూ ఓ సామాన్య సర్పంచ్ చేతిలో ఓడిపోయారు. అది కూడా 52 వేల ఓట్ల తేడాతో. అప్పటినుంచి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రజా తీర్పునకు మనస్థాపానికి గురయ్యారు. ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయాలకు దూరం కారని.. కుమారుడుకు రాజకీయ భవిష్యత్తు చూపించి నిష్క్రమిస్తారని తెలుస్తోంది. అయితే ఓటమి ఎదురైన నాటి నుంచి ఆయన ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. వైయస్సార్ వర్ధంతి కార్యక్రమానికి సైతం హాజరు కాలేదు. తాజాగా జగన్ నిర్వహించిన సమీక్షకు సైతం ముఖం చాటేశారు. జిల్లా నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణ దాసు, సిదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ తదితరులు హాజరయ్యారు. ధర్మాన మాత్రం గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది.
* జిల్లా పగ్గాలు కృష్ణ దాస్ కు
శ్రీకాకుళం జిల్లా వైసీపీ పగ్గాలు ధర్మాన కృష్ణ దాస్ కు అప్పగించారు జగన్. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను నియమించారు. కానీ ధర్మాన ప్రసాదరావుకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ప్రసాదరావు విషయంలో జగన్ కు సమాచారం ఉందని తెలుస్తోంది. ఓటమి ఎదురైన తర్వాత ధర్మాన ప్రసాదరావు నేరుగా జగన్ కు కలిశారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో జగన్ ఏం చెప్పారో తెలియదు కానీ.. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
* అధినేతపై అసంతృప్తి
ఈ ఎన్నికల్లో తనను తప్పించి కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు వైసీపీ టికెట్ ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు జగన్ ను కోరారు. కానీ జగన్ అందుకు అంగీకరించలేదు. దీంతో ధర్మాన ప్రసాదరావు పోటీ చేయాల్సి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టిడిపి టికెట్ నిరాకరించింది. కొత్త అభ్యర్థి గొండు శంకర్ కు టికెట్ ఇచ్చింది. అయితే తాను సునాయాసంగా విజయం సాధిస్తానని ప్రసాద్ రావు భావించారు. కానీ జిల్లాలో రికార్డు స్థాయిలో 52,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా మారింది. దీనికి జనసేన బలం తోడైంది. ఇప్పట్లో ఆ నియోజకవర్గంలో వైసిపి బలపడే ఛాన్స్ లేదని ప్రసాదరావు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కుమారుడు పొలిటికల్ ఎంట్రీ కి వేరే పార్టీ కోసం ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఇక్కడ ఉంటే వేస్ట్
ఒకవేళ వైసీపీలో కొనసాగినా ఐదేళ్ల పాటు వేచి చూడాలి. ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ సభ్యత్వం కానీ.. ఇచ్చే అవకాశం వైసీపీలో లేదు. అదేదో కూటమి పార్టీల్లో చేరితే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. కుమారుడికి భవిష్యత్తు అవసరాలు కల్పిస్తామంటే టిడిపిలో చేరేందుకు సైతం ప్రసాదరావు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ పదవి కానీ ఇస్తే పార్టీలో చేరతానని.. తన కుమారుడికి భవిష్యత్తులో అవకాశాలు కల్పించాలని ధర్మాన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు వైసీపీకి దూరంగా ఉంటే.. టిడిపికి దగ్గర కావచ్చు అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More