Secretariat Employees Transfers: ఏపీలో కూటమి ప్రభుత్వం( Alliance government ) సచివాలయ వ్యవస్థ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వాటి సేవలను మరింతగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. వారిని క్లస్టర్లుగా విభజించి సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు తాజాగా వారి విషయంలో మరో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎప్పటినుంచో సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అందులో ప్రధానమైనది బదిలీలు. ఇప్పుడు బదిలీలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు తదుపరి సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
* వైసిపి హయాంలో సచివాలయ వ్యవస్థ..
2019లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు సచివాలయ వ్యవస్థ ప్రారంభం అయ్యింది. వీటిలో దాదాపు 12 శాఖలకు చెందిన కార్యదర్శులను నియమించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. మీరు ఎప్పటినుంచో బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి తమ సమస్యలపై డిమాండ్ల రూపంలో వినతులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం వీరి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రెండు రోజుల్లో ఉత్తర్వుల విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. అందుకే ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కదలిక వచ్చింది.
* విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే..
విద్యా సంవత్సరం( academic year) ప్రారంభం కానుంది. ఈనెల 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. పిల్లల చదువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో హెచ్ఆర్ ఎంఎస్ పోర్టల్ లో బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం సచివాలయ ఉద్యోగులకు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇలా బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 16 వరకు గడువు ఇస్తారని సమాచారం. అనంతరం ఈనెల 22 నుంచి నిబంధనల ప్రకారం సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. సచివాలయాల యూజర్ మాన్యువల్ ప్రకారం బదిలీల్లో పలు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
* వీరికి ప్రాధాన్యం..
ముఖ్యంగా మ్యూచువల్( mutual), స్పౌజ్, మెడికల్ గ్రౌండ్స్, దివ్యాంగులు, తల్లిదండ్రులు ఆరోగ్యపరంగా పిల్లలపై ఆధారపడి ఉన్నవారు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం విధులు నిర్వహించిన వారు, కారుణ్య నియామకాల కింద భర్తీ అయిన మహిళలకు బదిలీల్లో ప్రాధాన్యత ఉండొచ్చని తెలుస్తోంది. అయితే గత వైసిపి ప్రభుత్వం ఓసారి సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ నిర్వహించింది. కానీ అది పూర్తిస్థాయిలో జరగలేదు. ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో బదిలీలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరి అది ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి.