Former YCP Minister : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath) అసంతృప్తిగా ఉన్నారా? పార్టీలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? తనకు ఇష్టమైన నియోజకవర్గాన్ని అప్పజెప్పలేదని బాధతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన నేతల్లో అమర్నాథ్ ఒకరు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయానికి తరచూ వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. అటువంటి నేత ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కనీసం చప్పుడు చేయడం కూడా లేదు. కేవలం విశాఖ నగరం నుంచి రూరల్ ప్రాంతానికి బదిలీ చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. చోడవరం నియోజకవర్గ ఇన్చార్జిగా మార్చిన తర్వాత గుడివాడ అమర్నాథ్ ఫుల్ సైలెంట్ అయ్యారు. పెద్దగా కనిపించకపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
* గాజువాక నుంచి భారీ ఓటమి
గత ఎన్నికల్లో గాజువాక( Gajuwaka) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో ఓడిపోయిన నేతగా రికార్డ్ సృష్టించారు. ఈయనపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ ఏకంగా 95 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. దీంతో పల్లా శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ బీసీ కోటాలో టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. అయితే చివరి నిమిషంలో గాజువాక నియోజకవర్గం కేటాయించడంతో గుడివాడ అమర్నాథ్ ఘోర పరాజయం ఎదురైంది. అయితే దీనిని ఒక గుణపాఠంగా నేర్చుకున్నారు గుడివాడ. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తేరుకొని విశాఖలో వైసీపీ శ్రేణులను సమన్వయ పరుచుకునే పనిలో పడ్డారు. అయితే ఆయన విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తనకు అప్పగిస్తారని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి చోడవరం బాధ్యతలను ఇచ్చారు. అప్పటివరకు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న కరణం ధర్మశ్రీ కి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు.
Also Read : ప్రతినెలా 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
* వైసిపి జిల్లా బాధ్యతలు నుంచి తప్పించడంతో..
మరోవైపు విశాఖ జిల్లా( Visakha district ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ ఉండేవారు. కానీ ఇటీవల ఆయన స్థానంలో కేకే రాజును నియమించారు. దీంతో మరింతగా సైలెంట్ అయ్యారు గుడివాడ అమర్నాథ్. తన విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు గుడివాడ అమర్నాథ్. మంత్రిగా ఉన్న అమర్నాథ్ ను ఆ నియోజకవర్గ నుంచి తప్పించారు. చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇచ్చారు. పోనీ గాజువాక ఇంచార్జ్ గానైనా కొనసాగించారంటే అది లేదు. ఒకవైపు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తప్పించడం, అదే సమయంలో ఇష్టం లేని నియోజకవర్గాన్ని కట్టబెట్టడంతో.. పొమ్మనలేక పొగ పెడుతున్నారని తీవ్ర ఆవేదనలో ఉన్నారు అమర్నాథ్.
* భీమిలి బాధ్యతలు ఆశిస్తే..
వాస్తవానికి భీమిలి( Bheemili ) నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను ఆశించారు గుడివాడ అమర్నాథ్. అక్కడ వైసీపీ ఇన్చార్జిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ఫలితాలు అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే భీమిలి తనకు అనుకూలంగా ఉంటుందని భావించారు గుడివాడ అమర్నాథ్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం భీమిలి బాధ్యతలను బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఇచ్చారు. అప్పటినుంచి మనస్థాపంతోనే ఉన్నారు. తాజాగా వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం గా ఉన్నారు. మరి గుడివాడ అమర్నాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.