Scrub Typhus Cases In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇటీవల ఒక చిన్న పురుగు భయపెడుతోంది. ఈ పురుగు కొట్టడం వల్ల ముందుగా జ్వరం వస్తుంది. అయితే జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ పురుగు మనిషిని కరిచినప్పుడు స్క్రబ్ టైపస్ అనే బాక్టీరియా మనిషి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత అనేక చర్యల ద్వారా ఒక రకమైన అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఇతర జ్వరాలు వచ్చినా కూడా స్క్రాప్ టైపస్ బ్యాక్టీరియానేనా? అన్న సందేహం కలుగుతోంది. ఈ తరుణంలో వైద్యులు ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో వివరించారు. వాటి వివరాల్లోకి వెళితే..
గ్రామీణ ప్రాంతాల్లో.. పొలాల్లో ఎక్కువగా నల్లి లాంటి ఒక పురుగు మనిషిని కుట్టడం వల్ల స్క్రబ్ టైపస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా దద్దుర్లు వస్తాయి, ఆ తర్వాత దగ్గు, కడుపునొప్పి, తీవ్రమైన అలసటతో పాటు వణుకు వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. ఓరియెంటియా సత్సుగముషి అనే బ్యాక్టీరియా ద్వారా స్క్రబ్ టైపస్ బ్యాక్టీరియా శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఇవి శ్వాసకోస సమస్యలను కూడా తీసుకువస్తాయి. ఆ తర్వాత అవయవాలపై ప్రభావం పడి పని చేయకుండా పోతాయి. చివరిగా ప్రాణం పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఒక రకమైన నల్లటి మచ్చ కలిగిన పురుగులు ఉంటాయి. వీటిని చూడగానే జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు దుస్తులను దులిపి వాడుకోవాలని.. ఇందులో ఇవి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువగా సంచరించని ప్రాంతాల్లో కూడా ఇవి ఉంటాయని.. మరి ముఖ్యంగా పంట పొలాల్లోకి వెళ్లేవారు వీటిని చూస్తూ వెళ్లాలని అంటున్నారు. చర్మం పై ఒక చిన్న నల్లటి మచ్చ లాగా ఉండే ఈ పురుగు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ప్రభావం చూపుతోంది. అయితే ముందు జాగ్రత్తగా పొలం పనులకు వెళ్లేవారు ప్రత్యేకంగా బూట్లు ధరించడం మంచిదని అంటున్నారు. అలాగే మంచాలు, పరుపులు, దిండులు వాడేటప్పుడు ఒకసారి వాటిని శుభ్రం చేసుకోవాలని అంటున్నారు.
ఇక ఈ బ్యాక్టీరియా ఒకరికి సోగిన తర్వాత మరొకరికి లాలాజలం ద్వారా సోకే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. ఈ విధంగా సోకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఒక మహిళ మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా స్క్రాప్ టైపస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని అంటున్నారు.