Aid Plane Hijack: విమాన ప్రయాణాలు పెరిగాయి జాతీయంగా, అంతర్జాతీయంగా విమానాలు మధ్య తరగతికి కూడా అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానంతో విమానాల రక్షణ కూడా పెరిగింది. ప్రయాణానికి ముందు పరీక్షించడం, ప్రయాణికుల వివరాలు సేకరించడం తదితర అంశాలు ప్రయాణికుల భద్రతను పెంచుతున్నాయి. దీంతో విమానాల హైజాక్ చాలా వరకు తగ్గింది. కానీ దక్షిణ సూడాన్‌లో తాజాగా ఒక విమానం హైజాక్ అయింది. అయితే పైలట్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది.
దక్షిణ సూడాన్ రాజధాని జుబా నుంచి మైవుట్‌కు వైద్య సామగ్రి తీసుకెళ్తున్న సమరిటన్స్ పర్స్ సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాన్ని హైజాక్ చేశారు. మంగళవారం టేకాఫ్ ముందు తుపాకీతో చొరబడిన యాసిర్ మహమ్మద్ యూసఫ్, వెనక క్యాబిన్‌లో దాక్కుని చాద్‌కు వెళ్లమని డిమాండ్ చేశాడు. ఆబయేయి ప్రాంతానికి చెందిన ఈ నిందితుడు జుబా ఎయిర్‌పోర్ట్ కంపెనీ లోగో చొక్కా ధరించి ఉన్నాడు.
పైలట్ వ్యూహాత్మక చర్యలు
విమానం గాలిలో కొన్ని గంటలపాటు చక్కర్లు కొట్టింది. చివరకు పైలట్ ఇంధనం తక్కువుందని చెప్పి వావు విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి, హైజాకర్‌ను అరెస్ట్ చేయించాడు. ఎవరూ గాయపడలేదు, విమానం సురక్షితంగా తిరిగి వచ్చింది.
దర్యాప్తు షురూ..
హైజాక్ కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. నిందితుడు ఆ కంపెనీలో పనిచేయడం లేదని నిర్ధారణ అయింది. సమరిటన్స్ పర్స్ ప్రతినిధి మెలిస్సా స్ట్రిక్‌లాండ్ భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.