Homeఆంధ్రప్రదేశ్‌SC Classification In AP: ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సై.. మూడు గ్రూపులుగా 59 కులాలు!

SC Classification In AP: ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సై.. మూడు గ్రూపులుగా 59 కులాలు!

SC Classification In AP: ఏపీలో ( Andhra Pradesh) ఎస్సీ వర్గీకరణ వైపు ప్రభుత్వం స్పష్టమైన అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సిద్ధపడుతోంది. వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జారీచేసింది ఏపీ ప్రభుత్వం. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. గవర్నర్ ఆమోదంతోనే ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వర్గీకరణ ద్వారా 59 ఉప కులాలకు లబ్ధి చేకూరనుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద కులాల వారిగా రిజర్వేషన్లు కేటాయించారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను రాజీవ్ రంజన్ మిశ్రా( Rajiv Ranjan Mishra) కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు జై కొట్టిన తొలి రాష్ట్రంగా గుర్తింపు సాధించింది ఏపీ ప్రభుత్వం. దీంతో మిగతా రాష్ట్రాల్లో సైతం ఒత్తిడి పెరుగుతోంది. వీలైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!

* అన్ని అడ్డంకులు దాటుకొని..
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అన్ని అడ్డంకులు దాటుకొని ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్( State Governor) ఆమోదంతో, న్యాయశాఖ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో వెంటనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ 2025 అమల్లోకి వచ్చింది. కొత్త నియామకాలు, ఉద్యోగాల పదోన్నతులు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని బ్యాక్ లాగ్ పోస్టులను వర్గీకరణ ద్వారా వర్తింపజేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థలకు ఇది వర్తించదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఈ వర్గీకరణ ఫలాలు అందుతాయి.

* దశాబ్దాల నిరీక్షణ తర్వాత..
ఎస్సీ వర్గీకరణ అనేది దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట. అయితే గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు( Supreme Court) ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ పై రాజ్యాంగపరమైన అధికారం ఉందని తెలిపింది. ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. వెంటనే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించారు. దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ మిశ్రా నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లు, పథకాల అమలును పరిశీలించింది. ఐదు నెలల పాటు అధ్యయనం చేసిన తరువాత ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 360 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది.

* ఆ కులాలకు రిజర్వేషన్లు ఇలా..
ఏపీలో( Andhra Pradesh) ఎస్సీ వర్గీకరణ జరిగితే 59 ఉపకులాలకు లబ్ధి చేకూరనుంది. షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన హక్కులు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. గ్రూప్ 1 కింద రెల్లి, ఉప కులాలుగా 12 ను చర్చి ఒక శాతం రిజర్వేషన్, గ్రూప్ 2 కింద మాదిగ, 18 కులాలను చేర్చి 6.5 రిజర్వేషన్, గ్రూప్ 3 కింద మాల, 29 కులాలను చేర్చి 7.5 రిజర్వేషన్ కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని వర్గీకరణ అమలు చేస్తారు. భవిష్యత్తులో జనాభా లెక్కలు మారితే.. జిల్లాను యూనిట్ గా తీసుకుని చేర్పులు మార్పులు చేస్తారు.

Also Read: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల పెంపు!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version