Sankranti Celebrations In Godavari: ఏడాది మొత్తం ఎన్నో రకాల పండుగలు వస్తాయి. కానీ అన్నింటిలో ప్రత్యేకం సంక్రాంతి. తెలుగు ప్రజలకు ఇదో ఎమోషనల్. అందుకే అంటారు పండుగలందు సంక్రాంతి వేరు అని అభివర్ణిస్తారు. నగరాలతో పాటు పట్టణాలకు ఉపాధి కోసం వలస బాట పట్టిన శ్రమజీవులు స్వగ్రామాలకు తరలివస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే ఏపీలోనే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అందుల గోదావరి జిల్లాలో అయితే ఆ పండుగ తీరే వేరు. ఏపీలో మిగతా ప్రాంతాల్లో సైతం సంక్రాంతి ని ఘనంగా జరుపుకుంటారు. గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆకర్షణగా మారుతాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తాయి కూడా.
* భాగ్యనగరం నుంచి క్యూ..
భాగ్యనగరంలో ఏపీ వాసులు అధికం. ఉపాధి కోసం వెళ్ళిన వారు ఉంటారు. ఉద్యోగాల కోసం వెళ్లిన వారు ఉంటారు. వ్యాపారాల్లో స్థిరపడిన వారు ఉంటారు. అందుకే సంక్రాంతి వస్తే వారంతా స్వగ్రామాలకు బయలుదేరుతారు. వందలు వేలు కాదు లక్షలాదిమంది స్వగ్రామాలను వెతుక్కుంటూ వస్తారు. విజయవాడ హైదరాబాద్ రహదారిని చూస్తే ఇట్టే అర్థమయిపోతుంది. వాహనాల రద్దీతో పాటు టోల్ ప్లాజాల వద్ద కనిపించే వాహనాలను ప్రత్యేక ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే అందులో సగానికి పైగా గోదావరి జిల్లాలకు వచ్చినవే.
* ప్రతిదీ ప్రత్యేకమే..
గోదావరి జిల్లాలు అంటే ఓన్లీ కోడిపందాలే కాదు. అక్కడ అతిధి మర్యాదలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. పిండి వంటల నుంచి మొదలుపెడితే విందు భోజనాల వరకు.. భోగి మంటల దగ్గర నుంచి మొదలుపెడితే కోట్లలో జరిగే కోడి పందాల వరకు.. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ప్రత్యేకమే. గోదారోళ్ల కొత్త అల్లుళ్ల కథ వేరే లెవెల్ లో ఉంటుంది. అత్తింటి వారి మర్యాదలు, బావ మరదళ్ల సరదాలు, సినిమా ధియేటర్ల వద్ద సందళ్లు, గోదావరి జిల్లాల స్పెషల్ వంటకాలు.. ఇలా ఒక్కటేమిటి కోరుకున్నోడికి కోరుకున్నంత మహదేవ అన్నట్టుగా ఈ రెండు జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతాయి.
* చుట్టాలు లేకపోయినా..
గోదావరి జిల్లాలకు స్థానికులే రారు. పిలిచిన చుట్టాలు ఉంటారు. ఇక్కడి సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకు వచ్చిన వారు ఉంటారు. ఏంటి ఈ గోదారి స్పెషల్ అని తెలుసుకునేందుకు వచ్చిన వారు ఉంటారు. కళ్ళారా వీక్షించి నేత్రానందం పొందిన వారు కొందరైతే.. కోడిపందాల పేరుతో లక్షల డబ్బులు పోగొట్టుకునేవారు మరికొందరు. ప్రభుత్వం ఏదైనా ఇక్కడ కోడిపందాల సంస్కృతిని గౌరవించాల్సిందే. ఏడాది మొత్తం ఉరుకుల పరుగుల జీవితాలతో.. సొంత వారిని సైతం దూరమై బిజీబిజీగా గడుపుతున్న రోజులు ఇవి. అలసిపోయే బతుకులకు ఈ సంక్రాంతి సెలవులు, వాటి వల్ల దొరికే ఆనందం వర్ణనాతీతం. అయితే గోదారోళ్ల సంక్రాంతి ఏడాది మొత్తానికి ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.