Jagan: ఏదైనా చెబితే హేతుబద్ధత ఉండాలి. అబద్ధం చెప్పినా నమ్మినట్టు ఉండాలి. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తరచూ ఫెయిల్ అవుతున్నారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చి మళ్లీ అమరావతి పై లేనిపోని మాటలు మాట్లాడారు. ఇప్పుడిప్పుడే జగన్ విషయాన్నీ మరిచిపోతున్న అమరావతి రైతులను మళ్లీ కెలికారు. నది గర్భంలో అమరావతిని కడుతున్నారు అంటూ నిందలేశారు. అయితే రెండో విడత భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వంపై అమరావతి రైతులు అసంతృప్తితో ఉన్నారు. జగన్ ఆ మాటలు అనేసరికి వారంతా తమ అసంతృప్తి తగ్గించుకున్నారు. తమ శాశ్వత శత్రువు జగన్మోహన్ రెడ్డి అని బలంగా నమ్మడం ప్రారంభించారు. డామిట్ కథ అడ్డం తిరిగింది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. జగన్ మాటలను వక్రీకరించారని సంజాయిషి ఇవ్వడం ప్రారంభించారు. అమరావతి తో వదల్లేదు జగన్. ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. అందులో భారతి సిమెంట్స్ గురించి ప్రస్తావించారు ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
* పారిపోయిన పరిశ్రమల జాబితాలో..
జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కంపెనీలు పెట్టుబడుల పేరుతో ఏపీలో ఆస్తులు ఆక్రమించుకుంటాయి. జగన్ అధికారంలో లేకపోతే వాటి దగ్గర పెట్టుబడులకు డబ్బులు ఉండవు. అయితే పారిపోయిన పరిశ్రమల జాబితాలో జగన్మోహన్ రెడ్డి భారతి సిమెంట్స్ ను చేర్చడం చాలామంది ఆశ్చర్యానికి కారణం అయింది. ప్రభుత్వం వేధిస్తున్నందున తమ సంస్థను కూడా తరలిస్తామని జగన్ చెబుతున్నారు. అయితే ప్రభుత్వం అక్రమంగా ఆయన కేటాయింపు చేసుకున్న భూముల లీజు విషయంలో నోటీసులు మాత్రమే ఇచ్చింది. దానిని వేధింపులుగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికారంలో ఉన్నప్పుడే తన కుటుంబ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయల విలువైన గనులను కట్టబెట్టారు. భారతి సిమెంట్స్ కు కేటాయించిన లీజుల్లో నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో.. కూటమి ప్రభుత్వం ఆ లీజులను రద్దు చేసేందుకు సిద్ధపడింది. దానిని పరిశ్రమలను తరిమివేయడం అంటారా?
* రఘురాం సిమెంట్స్ పేరిట లీజులు
అసలు భారతి సిమెంట్స్ ఏర్పాటు అక్రమమని ఆరోపణలు ఉన్నాయి.. భారతి సిమెంట్స్ అసలు పేరు అది కాదు. రఘురాం సిమెంట్స్. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీని కొనుగోలు చేశారు. రఘురాం సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి లీజులు ఉన్నాయి. భారతి సిమెంట్స్ గా మారిన తర్వాత ఆ లీజులను ఆ కంపెనీ వాడుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో గనుల విషయంలో కేంద్రం స్పష్టమైన పాలసీని తీసుకొచ్చింది. ఓ కంపెనీ పేరుతో లీజులు తీసుకొని.. మరో కంపెనీ టేక్ ఓవర్ చేస్తే లీజులు చెల్లవు అని స్పష్టం చేసింది. 2017లో అప్పటి టిడిపి ప్రభుత్వం రఘురాం సిమెంట్స్కు ఇచ్చిన ప్రాథమిక అనుమతిని కూడా రద్దు చేసింది.
2019లో ఏపీలో అధికారం మారిన తర్వాత సీన్ చేంజ్ అయింది. కొన్ని రకాల న్యాయపరమైన అంశాలను తెరపైకి తెస్తూ లీజులను పునరుద్ధరించుకున్నారు. అయితే హైకోర్టు ఈ విషయంలో కొన్ని రకాల సూచనలు చేసిన పట్టించుకోలేదు. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు లీజులను పునరుద్ధరిస్తూ జీవోలు జారీచేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు వెళ్ళింది. విచారణ చేయాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. దీంతో అసలు విషయం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో పరిశ్రమలను తరిమేస్తున్నారన్న ప్రచారం మొదలుపెట్టారు జగన్.