Sajjala Ramakrishna Reddy : జగన్ జమానాలో సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందారు సజ్జల రామకృష్ణారెడ్డి. గత ఐదు సంవత్సరాలుగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కూడా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వైసీపీలోని సీనియర్లు అసూయ చెందేలా క్రియాశీలక పాత్ర పోషించారు సజ్జల. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తాను క్రియాశీలక పాత్ర పోషించగా.. పార్టీకి ఆయువుగా భావించే సోషల్ మీడియా విభాగాన్ని తన కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు. తండ్రీ కుమారుల వల్లే పార్టీకి పరిస్థితి వచ్చిందన్న విమర్శ ఉంది. అందుకే ఇన్ని రోజులు వారు కనిపించలేదు. కానీ ఇప్పుడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా.. సకల శాఖామంత్రి సజ్జల వారు బయటకు వచ్చారు. ఓటమిని అంగీకరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అసలైన వారసుడు జగన్ అని చెప్పుకు రావడం ప్రారంభించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 40 రోజులు సమీపిస్తున్నాయి. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వారు మీడియా ముందుకు వచ్చింది తక్కువే. ఆయన తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు విదేశాలకు తరలిపోయారని ప్రచారం ఉంది. ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి సైతం అదృశ్యమయ్యారు. విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన ఓటమికి ఈవీఎంలే కారణమని జగన్ చెప్పుకొచ్చారు. అవ్వ తాతల ప్రేమ ఏమైందోనని అనుమానం వచ్చేలా మాట్లాడారు. ఆ పథకాలు ఎటు వెళ్లిపోయాయో అని అమాయకపు మాటలు చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ప్రేమ ఏమైందో అని నిర్వేదంతో మాట్లాడారు. అయితే ఓడిపోయిన ఎమ్మెల్యేలు అసలు విషయం తెలిసి ఆక్షేపణలు ప్రారంభించారు. అయినా సరే గెలిస్తే తాను.. ఓడిపోతే యంత్రాలు అన్నట్టు మాట్లాడారు జగన్.
ఇప్పుడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా బయటకు వచ్చారు సజ్జల వారు. అసలు విషయాన్ని బయటపెట్టారు. ఓటమిపై అనుమానాల సంగతి ఎలా ఉన్నా.. ప్రజల తీర్పుగానే భావిస్తున్నామని.. ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పుకొచ్చారు సకల శాఖ మంత్రి. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని ఎన్నికలకు వెళ్లాం. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి. అంటే జనం తిరస్కరించారని అర్థమయింది అంటూ మాట్లాడారు సజ్జల వారు. ఎంత జరిగినా ఆ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అసలు సిసలైన వారసుడు జగన్ మాత్రమేనని షర్మిలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల వారు. ఇక తేల్చుకోవాల్సింది ఏపీ ప్రజలే.