Sajjala Ramakrishna Reddy : ముంబై నటి వ్యవహారం వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో నటి ప్రేమ వ్యవహారం వివాదంగా మారింది. దీంతో సదరు పారిశ్రామికవేత్త నాటి ప్రభుత్వ పెద్దల సాయాన్ని తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ నటి తో పాటు కుటుంబాన్ని ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారన్నది ఈ వార్త సారాంశం. లేనిపోని కేసులు పెట్టి జైలు వరకు తీసుకెళ్లి వారిని భయపెట్టేలా చేశారని.. దీంతో నటి పెళ్లి వ్యవహారానికి ప్యాకప్ చెప్పి కుటుంబంతో తిరిగి ముంబై వెళ్ళిపోయారని తాజాగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నాటి వైసిపి ప్రభుత్వ పెద్దగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చింది. ఈనాడులో ప్రత్యేక కథనం వచ్చింది. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఈనాడు కథనంపై మండిపడ్డారు. ఈనాడు పై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలు మరల్చేందుకే ఇటువంటి కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బాధిత నటి ముంబై నుంచి విజయవాడ వచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే వైసీపీ నేతలు ఇబ్బందుల్లో పడినట్టే.
* విజయసాయి రెడ్డి పై అలా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతల వ్యక్తిగత వ్యవహార శైలి బయటపడుతోంది. తొలుత విజయసాయిరెడ్డి పై బలమైన ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త.. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఏపీలో ఇది పెను దుమారం అయ్యింది. ఎన్నెన్నో మలుపులు తిరిగింది. చివరకు శాంతి భర్త డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధమని సవాల్ చేసేదాకా వచ్చింది. అటు తరువాత విజయసాయిరెడ్డి సైలెంట్ కావడంతో.. వివాదం సద్దుమణిగినట్టు కనిపించింది.
* ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్
అటు తరువాత ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం బయటపడింది. దువ్వాడ ఫ్యామిలీలో రచ్చ నడిచింది. ఆయన నివాసం వద్ద భార్య, ఇద్దరు పిల్లలు ధర్నా చేయడం ప్రారంభించారు. మధ్యలో ఆయన స్నేహితురాలు మాధురి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వివాదం పెను దుమారంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారింది. చివరకు వైసీపీ కలుగజేసుకోవలసి వచ్చింది. టెక్కలి ఇన్చార్జి బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాసును తప్పించింది. ఇంకా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది.
* అనంత బాబు అసభ్య వీడియో
ఇంకోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వివాదాస్పద వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారన్నది అనంత్ బాబు పై వచ్చిన ఆరోపణ. ఇప్పటికే హత్య కేసులో బెయిల్ పై ఉన్న ఆయన అనుచిత ప్రవర్తన వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో ఏం చేయాలో పాలుపోక వైసీపీ హై కమాండ్ సతమతమవుతోంది. అది మార్ఫింగ్ వీడియో అని అనంతబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమగ్ర దర్యాప్తు కోసం పోలీస్ శాఖ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
* తాజాగా బాలీవుడ్ నటి వివాదం
అయితే ఈ మూడు ఘటనలు మరువక ముందే బాలీవుడ్ నటి వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఇది వెలుగులోకి రాకమునుపే సోషల్ మీడియాలో.. తరువాత ఎపిసోడ్ సజ్జల రామకృష్ణారెడ్డిదేనని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంతలో నటి వ్యవహారం వెలుగులోకి రావడం, అందులో సజ్జల పాత్ర ఉందని ఈనాడులో ప్రత్యేక కథనం రావడంతో చాలా వైరల్ అయింది. అందుకే దీనిపై సజ్జల స్పందించారు. ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని.. దీనికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సహకరిస్తోందని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారానికి దిగిన ఈనాడు పై న్యాయపోరాటం చేస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వెల్లడించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది.