Director Krish: ఆ సినిమా ఫ్లాప్ అయ్యుంటే నేను సినిమాలు మానేసేవాడిని : డైరెక్టర్ క్రిష్

కేవలం అలాంటి సినిమాలు మాత్రమే కాదు, 'గౌతమీ పుత్ర శాతకర్ణి', 'హరి హర వీరమల్లు' లాంటి పీరియడ్ సినిమాలను కూడా చెయ్యగలడు డైరెక్టర్ క్రిష్. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

Written By: Vicky, Updated On : August 28, 2024 12:26 pm

Director Krish

Follow us on

Director Krish: సున్నితమైన అంశాలను తీసుకొని, హృదయాలను కదిలించే మాటలతో, ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని కలిగించిన దర్శకులలో ఒకరు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. ఆయన సినిమాలన్నీ జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించేలా ఉంటాయి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం , కంచె వంటి చిత్రాలు క్రిష్ దర్శకత్వ ప్రతిభకు తార్కాణాలు. ఈ సినిమాలు చూసి బయటకి వచ్చే ప్రేక్షకులు ఎదో కొత్త రకమైన అనుభూతి పొందిన వారీగా ఫీల్ అవుతూ ఉంటారు.

కేవలం అలాంటి సినిమాలు మాత్రమే కాదు, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, ‘హరి హర వీరమల్లు’ లాంటి పీరియడ్ సినిమాలను కూడా చెయ్యగలడు డైరెక్టర్ క్రిష్. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన ఈటీవీ లో ప్రసారమయ్యే ‘నా ఉఛ్వాసం కవనం’ అనే ప్రోగ్రాం లో పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రాంలో ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకి ఉన్న గొబ్బ అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ ఒక సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో, పాటలు కూడా అంతే ముఖ్యం. అంతే కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు ఇంకా ముఖ్యం. కథకి ఆయన పాటలు ఒక వారధి లాగ నిలుస్తాయి. ఆయన రాసే పాటలు సినిమాలో అప్పటి వరకు జరిగిన కథ కనిపిస్తుంది, ఆ తర్వాత జరగబోయే కథ కూడా కనిపిస్తుంది. నా ‘గమ్యం’ చిత్రంలో ‘ఎంతవరకు..ఎందుకొరకు’ పాటలో సినిమా మొత్తాన్ని చూపించేసారు. సీతారామశాస్త్రి గారు ఆ పాటలో రాసిన పదాలను మ్యాచ్ చేస్తూ చిత్రీకరణ చెయ్యడం నాకు పెద్ద సవాలుగా మారింది. అంత గొప్పగా ఉంటుంది. ఆయన ఒక్కో పాటకు అప్పట్లో రెండు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునేవారు. నేను కేవలం ఒక్క పాట ఆయనతో రాయించుకొని, మిగిలిన 5 పాటలు వేరే వాళ్ళతో రాయించుకోవాలని అనుకున్నాను. కానీ ఆయన ఒక్క పాట రాయాలన్నా కథ మొత్తం చెప్పాలి. ఆ కథకి తగ్గట్టుగా పాటలు రాస్తారు. నా సినిమా కథ వినగానే, మొత్తం ఆరు పాటలు నేనే రాస్తాను అని చెప్పాను. మీరు పాటకు 2 లక్షలు తీసుకుంటారు, 6 పాటలకు 12 లక్షలు అవుతుంది. మాకు నిర్మాతగా గారు కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ మాత్రమే ఇచ్చారు అని చెప్పాను. అప్పుడు శాస్త్రి గారు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు. పాటలు రాస్తాను, సినిమా విడుదలైన తర్వాత నీకు ఎంత ఇవ్వాలని అనిపిస్తే అంత ఇవ్వు అన్నారు’ అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘గమ్యం’ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి కథ, స్క్రీన్ ప్లే ఎంత కారణమైందో, అంతకంటే ఎక్కువగా శాస్త్రి గారి సాహిత్యం కూడా ప్రధాన కారణం అయ్యింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యుంటే నేను విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునేవాడిని అంటూ చెప్పుకుకొచ్చాడు డైరెక్టర్ క్రిష్.