Sajjala comments on AP capital: ఏపీలో అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై దృష్టి పెట్టింది. అమరావతి పనులు పున ప్రారంభించింది. తొలి ఏడాది నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది. ఈ ఏడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పున ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయించింది. అప్పటినుంచి పనులు మొదలయ్యాయి. అయితే అమరావతిపై పాత ప్రచారానికి పరిమితం అయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి రాజధాని అనేది శ్రేయస్కరం కాదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసింది. కానీ మేము అమరావతికి వ్యతిరేకం అని బాహాటంగా ప్రకటించలేకపోయింది. కానీ ఆ పార్టీకి చెందిన కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను తాజాగా ప్రకటించారు. అమరావతి విషయంలో కీలక ప్రకటన చేశారు.
ఏకాభిప్రాయంతో ఎంపిక..
2014లో అధికారంలోకి వచ్చింది టిడిపి( Telugu Desam Party). అందరి అభిప్రాయంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. అయితే నాడు విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమరావతి రాజధానికి మద్దతు తెలిపారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోవడం మానేశారు. మూడు రాజధానుల అంశాన్ని బయటకు తెచ్చారు. అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసి.. టిడిపి హయాంలో సేకరించిన భూములను వివిధ అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించారు. దీంతో అమరావతి భూములు వృధాగా మిగిలిపోయాయి. అయితే అదే సమయంలో మూడు రాజధానుల అంశాన్ని కూడా అమలు చేసి చూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. దీంతో 2024 ఎన్నికల్లో రాజధాని అంశం విపరీతంగా ప్రభావం చూపింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది.
సజ్జల క్లారిటీ..
అయితే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress party ) పార్టీ తన స్టాండ్ ను తెలియజేయలేకపోయింది. తొలినాళ్లలో బొత్స సత్యనారాయణ లాంటి నాయకులు మాత్రం సరైన సమయంలో రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అయితే విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి అవసరమైన భవనాలు కడితే సరిపోతాయి కదా అని తేల్చి చెప్పారు. అమరావతి రాజధాని ప్రాంతంగా పనికి రాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అది వరద ప్రభావిత ప్రాంతమని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. ఈ తరుణంలో వైసిపి ఇంకా అమరావతిని వ్యతిరేకిస్తుందన్న టాక్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని విషయంలో యూటర్న్ తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాగూ అమరావతి రాజధాని నిర్మాణం ఆగదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వరం మారిందన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?