MP Avinash Reddy – Sajjala Ramakrishna Reddy: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టిన వేళ.. అతడికి అండగా నిలిచారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి. మీడియాతో చిట్ చాట్ తో మాట్లాడిన ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేకా హత్యకేసులో కొన్ని మీడియా సంస్థలు అతి చేస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే పులివెందుల నుంచి హైదరాబాద్ చేరుకున్న అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారని అంతా భావించారు. కానీ తల్లి లక్ష్మీదేవమ్మ అనారోగ్యానికి గురవ్వడంతో హైదరాబాద్ నుంచి వెనుదిరిగారు. తల్లి అనారోగ్యం కారణం చూపుతూ గైర్హాజరవుతున్నట్టు సీబీఐకి సమాచారం ఇచ్చారు.
అయితే దీనిపై మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. అరెస్టు భయంతోనే అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరయ్యారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీనిపై సజ్జల రామక్రిష్ణారెడ్డి స్ట్రాంగ్ గా రియాక్టయ్యారు. సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరిస్తున్నారని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకే ఆయన హైదరాబాద్ వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ఫ్రచారానికి దిగుతున్నాయని మండిపడ్డారు. తల్లి అనారోగ్యం విషయం సీబీఐకి సమాచారమిచ్చి పులివెందుల తిరుగు ప్రయాణమయ్యారని గుర్తుచేశారు. ఏదో జరిగిపోతోందని హడావుడి చేయడం దారుణమన్నారు.
వివేకా హత్య కేసులో రామోజీరావు, రాధాక్రిష్ణలది తప్పుడు ప్రచారమన్నారు. అసలు నిందితుడు రోడ్డుపై దర్జాగా తిరుగుతున్నాడని.. ఒక ఎంపీ అని చూడకుండా అవినాష్ రెడ్డిని వెంటాడుతుండడం తగునా అని ప్రశ్నించారు. అవినాష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అతడే నిందితుడై ఉంటే నాటి సీఎం చంద్రబాబు విడిచిపెట్టేవారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఆరుసార్లు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యాడని.. మరోసారి హాజరుకాకుండా ఎందుకు తప్పించుకోవాలని చూస్తాడని సజ్జల ప్రశ్నించారు. కేసును ధైర్యంగా ఎదుర్కొవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని.. ఈ విషయంలో అతి ప్రచారాన్ని తగ్గించుకోవాలని రామోజీరావు, రాధాక్రిష్ణలకు సజ్జల హితవుపలికారు. అయితే అవినాష్ రెడ్డి గైర్హాజరుపై అనూహ్యంగా సజ్జల మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.