Saamineni udayabhanu : వైసీపీని వరుసగా సీనియర్లు వీడుతున్నారు. పరాజయం ఎదురు కావడంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎప్పటికీ ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇప్పుడు బాలినేని, సామినేని ఉదయభాను పేరు వినిపిస్తోంది. ఒకరు వైయస్ కుటుంబానికి బంధువు కాగా, మరొకరు వీర విధేయుడు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోతుండడంపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఇందులో సామినేని ఉదయభాను సొంత నియోజకవర్గం జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తో సహా 18 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. దీంతో సామినేని వైసీపీని వీడతారనే ప్రచారం బలంగా పెరిగింది. అయితే ఆయనలో ఈ స్థాయిలో అసంతృప్తి ఉందని ఎవరికీ తెలియదు. వైసిపి ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేశారు. ఎంతో నమ్మకంతో ఉన్న జగన్ తనను నమ్మలేదని.. మంత్రి పదవి కేటాయించలేదని ఆయనలో అసంతృప్తి మిగిలిపోయింది.
* రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు
ఉదయభాను వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత విధేయత కలిగిన నేత. 1999లో రాజశేఖర్ రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది. ఆ ఎన్నికల్లో గెలిచారు కూడా. అప్పటినుంచి రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడిగా మారిపోయారు. వైయస్సార్ తో ఉన్న అనుబంధం తోనే ఆయన జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతోమంత్రి అవుతానని ధీమాతో ఉండేవారు. కానీ రకరకాల సమీకరణలతో జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. పోనీ విస్తరణలోనైనా ఛాన్స్ ఇస్తారని భావించారు. కానీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మంత్రి అవుతానన్న ఆశ తీరలేదు. అప్పటినుంచి ఓ రకమైన అసంతృప్తితో ఉండేవారు.
* ఎన్నికల ముందు నుంచే
ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయాలని ఆయన భావించలేదు.ఎన్నికలకు ముందు జనసేనలో చేరేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు వైసీపీ ఓటమితో పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సామినేని ఉదయభాను మాట చెల్లుబాటు అయ్యేది. వైసీపీ నుంచి టిడిపిలో చేరేందుకు సిద్ధపడిన కౌన్సిలర్లను ఉదయభాను కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది.
* తర్జనభర్జన
ఉదయభాను పార్టీని వీడుతారని జగ్గయ్యపేట నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. స్వయంగా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సైతం త్వరలో ఉదయభాను పార్టీని వీడుతారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.వైసిపి కౌన్సిలర్లు టిడిపిలో చేరే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే సామినేని ఉదయభాను టిడిపిలో చేరతారా? లేకుంటే జనసేనలోనా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా సామినేని ఉదయభాను కు మంచి పేరు ఉండడంతో పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో చిరంజీవితో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.