Roja: రోజా కోసం పెద్దిరెడ్డి మనుషులను వదులుకున్న జగన్!

ఎన్నికల్లో రోజా ఓడిపోయారు. మంత్రిగా ఉంటూనే భారీ ఓటమి చవిచూశారు. అయితే ఆమె ఓటమి వెనుకసొంత పార్టీ నేతలే ఉన్నారన్న ఆరోపణలు చేశారు రోజా. ఇప్పుడు ఆమె ఫిర్యాదు మేరకు వారిపై వేటు వేస్తున్నారు జగన్. కానీ వారందరూ పెద్దిరెడ్డి అనుచరులు కావడం విశేషం.

Written By: Dharma, Updated On : September 15, 2024 9:38 am

Roja

Follow us on

Roja: మాజీ మంత్రి రోజా వైసీపీలో యాక్టివ్ అయ్యారు. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ పార్టీలో రీఎంట్రీ ఇచ్చినంత పని చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. దీంతో మరింత దూకుడుగా ముందడుగు వేయాలని భావిస్తున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థుల కంటే ముందుగానే.. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై ప్రతాపం చూపడం ప్రారంభించారు. హై కమాండ్ తో చెప్పి ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు రోజా. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయానన్న బాధ కంటే.. సొంత పార్టీ నేతలే తనను దెబ్బ కొట్టారన్నబాధ ఆమెను వెంటాడుతోంది.ఓడిపోయిన తరువాత ఆమె నగిరి నియోజకవర్గానికి రాకపోవడంతో.ఇక రోజా పని అయిపోయిందని.. తిరిగి నగిరి వచ్చే ఉద్దేశం లేదని.. ఆమెకు జగన్ చాన్స్ ఇవ్వరని రకరకాల ప్రచారం నడిచింది. కానీ జగన్ ఎంతో నమ్మకంతో ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆమె అధినేత పై ఒత్తిడి తెచ్చి నగిరిలో తనను ఇబ్బంది పెట్టిన వారందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించే పనిలో పడ్డారు.

* విస్తరణలో రోజాకు చాన్స్
వైసిపి హయాంలో విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కింది. అయితే ఆమె మంత్రిగా దర్పం ప్రదర్శించినా.. సొంత నియోజకవర్గంలో మాత్రం నేతల అభిమానాన్ని గెలవలేకపోయారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆమెకు టికెట్ ఇస్తే పని చేయమని కూడా తేల్చి చెప్పారు. కానీ జగన్ మాత్రం ఎంతో నమ్మకంతో ఆమెకు టికెట్ ఇచ్చారు. పోలింగ్ నాడే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.తన ఓటమికి సొంత పార్టీ నేతలే ప్రయత్నించారని ఆరోపించారు.

* ఇలా ఫిర్యాదు చేశారో.. లేదో
మూడు రోజుల కిందట చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు.ఈ క్రమంలో తన ఓటమికి కారణాలను వివరించారు రోజా. ముఖ్యంగా నగిరి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శాంతి దంపతులపై వేటు వేయాలని కోరారు. ఆమె విన్నపం మేరకు జగన్ స్పందించారు. శాంతితో పాటు ఆమె భర్త కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు.

* వ్యతిరేకంగా నాలుగు గ్రూపులు
నగిరిలో రోజాకు వ్యతిరేకంగా నాలుగు గ్రూపులు పనిచేసేవి.వీరిలో కేజే శాంతి,కుమార్ తప్ప మిగిలిన వారంతా ఎన్నికలకు ముందే టిడిపిలో చేరిపోయారు. ఎన్నికల్లో శాంతి దంపతులు రోజాకు వ్యతిరేకంగా పనిచేశారని ప్రచారం కూడా ఉంది.వాస్తవానికి శాంతి దంపతులు మాజీమంత్రి,సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు. రోజాకు టిక్కెట్ దక్కకపోతే తమకు ఇస్తారని భావించారు. కానీ జగన్ రోజా మీద నమ్మకం పెట్టి టిక్కెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రోజా ఫిర్యాదు మేరకు పెద్దిరెడ్డి అనుచరులనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. అయితే ఇదంతా రోజాకు తాత్కాలికంగా మెప్పించేందుకే ఇలా చేశారన్న కామెంట్స్ వినిపించాయి. పెద్దిరెడ్డి అనుమతి లేకుండా ఆయన అనుచరులపై వేటువేయడం అంత ఈజీ కాదని.. కానీ రోజాపక్క చూపులు చూడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.